భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు

శ్రీలంక భారత్ కు బాసటగా నిలిచింది. నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని, అందుకే ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాల్లేకుండా దారుణమైన ఆరోపణలు (భారత్ పై) చేసినట్టు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే ధ్వజమెత్తారు. 

భారత్- కెనడా వివాదంపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.‘‘శ్రీలంక విషయంలోనూ కెనడా అదే విధంగా వ్యవహరించింది. శ్రీలంకలో మారణహోమం జరిగిందంటూ అవాస్తవాలు పలికింది. మా దేశంలో మారణహోమం జరగలేదని ప్రతి ఒక్కరికీ తెలుసు’’అని అలీ సబ్రే వివరించారు.

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేయడం ద్వారా ద్వైపాక్షిక వివాదానికి దారితీయడం తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత వ్యతిరేక, వేర్పాటు వాద, ఉగ్రవాద శక్తులకు కెనడా అడ్డాగా మారిందంటూ, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

అలాగే ఇటీవల కెనడా పార్లమెంట్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పని చేసిన సైనికుడిని గౌరవించడంపై కూడా శ్రీలంక మంత్రి స్పందించారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడోపై ఆయన విమర్శలు చేశారు.

“నేను నిన్న చూశాను. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలతో సంబంధం ఉన్న వ్యక్తికి ట్రూడో ఘన స్వాగతం పలికారు. ఇది సందేహాస్పదంగా ఉంది. ట్రూడో గతంలో కూడా ఇలానే వ్యవహరించారు. ఏదీ సరిగ్గా తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారు. దీంతో కొన్నిసార్లు ట్రూడో దారుణమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించదు.” అంటూ విమర్శించారు. 

ట్రూడో చేసిన “మారణహోమం” వ్యాఖ్యలు శ్రీలంక-కెనడా సంబంధాలను ప్రభావితం చేశాయని సబ్రీ గుర్తు చేశారు.  “ఇది వాస్తవానికి మా సంబంధాన్ని ప్రభావితం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దానిపై భిన్నమైన వైఖరిని కలిగి ఉంది. శ్రీలంక మారణహోమానికి గురికాలేదని గ్లోబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది” అని వివరించారు. 

“అయితే ఒక రాజకీయ నాయకుడిగా ట్రూడో మారణహోమం జరిగిందని చెప్పారు. అది విరుద్ధమైనది. ఒక దేశం నాయకుడు చేసే ఇటువంటి బాధ్యతా రహితమైన ప్రకటనలు శాంతి, సయోధ్యను ప్రోత్సహించడానికి బదులుగా కెనడా, శ్రీలంక మధ్య అసమ్మతి, ద్వేషాన్ని పెంచుతాయి.” అని సబ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే సార్వభౌమాధికారం ఉన్న దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కెనడా ప్రధానికి ఆయన సూచించారు. “ఎవరూ ఇతర దేశాలకు ముక్కు పొడిచి, మన దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్పాలని నేను అనుకోను. మనం మన దేశాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము. అందుకే మనం మన దేశంలో ఉన్నాము.’’ అని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు.