కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఖలిస్థానీ వేర్పాటు గ్రూపులు, ఖలిస్థానీ మద్దతుదారులు విదేశాల్లో ఉన్న భారతీయులపై, భారతీయ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అయితే కొన్ని నెలల కిందట కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దానిపై స్పందించిన కెనడా ప్రధాని భారత్‌పై ఆరోపణలు చేయడంతో ఖలిస్థానీ సానుభూతి పరులకు ఆయుధంగా మారింది.
 
ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలు చేయాలని ఖలిస్థానీ గ్రూప్ పిలుపునిచ్చింది. ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కెనడాలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల ముందు ప్రదర్శనలు, నిరసనలు చేయనున్నట్లు సిఖ్స్ ఫర్ జస్టిస్ డైరెక్టర్ జతీందర్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. 

టొరంటో, ఒట్టావా, వాంకోవర్‌లోని భారత ఆఫీస్‌ల ముందు సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయని వెల్లడించారు. భారత రాయబారిని బహిష్కరించాలని కెనడాను కోరుతున్నట్లు గ్రేవాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, హింసాత్మక ఘటనలు తలెత్తకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ కు చెందిన భారత్‌ను విడగొట్టి ప్రత్యేక కాశ్మీర్, ముస్లింలకు వేరే దేశంగా చేయాలని పేర్కొన్న ఆడియోకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ తాజాగా వెల్లడించింది. ఇతనిపై 16 కేసులు కూడా ఉన్నట్టు తేలింది.  ఇప్పుడు తాజాగా కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతనికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని, పంజాబ్‌లోని హిందూ నేతలను అతడు టార్గెట్ చేయాలనుకున్నాడని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ పోలీసులు ఇద్దరు ఉగ్రవాద అనుమానితులైన జగ్జీత్ సింగ్ జగ్గా, నౌషాద్‌లను అరెస్ట్ చేశారు. వీరిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అభియోగాలు మోపారు. వీరిద్దరిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అర్ష్‌దీప్ దల్లాతో తాము టచ్‌లోనే ఉన్నామని వాళ్లు తెలిపారు. 
 
అంతేకాదు పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సిద్ధం కావాలని అతడు తనకు ఆదేశాలు జారీ చేశాడని కూడా జగ్గా పేర్కొన్నాడు. ఇతని వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు రెండు నెలల క్రితం కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. హిందూ సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులను కూడా అతడు లక్ష్యంగా చేసుకున్నాడన్న కుట్ర కూడా బట్టబయలైంది. 
 
లష్కర్ హ్యాండ్లర్ అయిన సుహైల్‌తో అర్ష్‌దీప్‌ టచ్‌లో ఉన్నాడని, అతని సూచనల మేరకు సుహైల్ ఢిల్లీలోని జహంగీర్‌పురి వద్ద ఓ హిందూ బాలుడిని హత్య చేసి చంపాడని జగ్గా చెప్పాడు. తాము ఆ వీడియోని రికార్డ్ చేసి, దల్లాకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడినందుకు గాను నేరస్తులు రూ.2 లక్షలు కూడా అందుకున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.