అమెరికా వచ్చే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే

గడిచిన మూడు నెలల్లో అమెరికా 90,000కు పైగా స్టూడెంట్స్ వీసాలు జారీ చేసింది. ఈ విషయాన్ని భారతదేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం  తెలిపింది. అమెరికా జూన్, జులై, ఆగస్టు ఈ త్రైమాసికంలో ఈ రికార్డు స్థాయి వీసాలు ఇచ్చారని తెలియచేయడానికి సంతోషిస్తున్నట్లు యుఎస్ దౌత్యకార్యాలయం పేర్కొంది. 

ఈ స్టూడెంట్స్ వీసాలలో అత్యధికంగా భారతీయ విద్యార్థులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెలువరించిన స్టూడెంట్స్ వీసాల లెక్క చూసుకుంటే ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాల్లో ఒక్క వీసా భారతీయ విద్యార్థికి వీసా దక్కిందని తెలిపారు. భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు వీసాలు పొందినందుకు వారి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ అని తెలిపారు. 

భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికాను తమ విద్యా ఉన్నత లక్షాలకు ఎంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, ఇది అత్యద్భుతం అని పేర్కొన్నారు. అర్హులైన దరఖాస్తుదార్లందరికి వీసా జారీ జరిగిందని వివరించారు. 

గత ఏడాది భారత ప్రభుత్వం వెలువరించిన అధికారిక సమాచారం ప్రకారం ఇప్పుడు 2022లో దాదాపుగా 4,65,791 మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. ఓపెన్ డోర్స్ రిపోర్టు 2022 ప్రకారం చూస్తే మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలలో భారతదేశానికి 11.8 శాతం వాటా అంతకు ముందు ఉండగా అది 21 శాతానికి పెరిగింది. 

ఇప్పుడు చైనా కన్నా భారతీయ విద్యార్థులే అమెరికాలో ఎక్కువగా స్టూడెంట్స్ వీసాలపై ఉన్నారు. అమెరికాలో చదువులపై ఉన్న భారతీయ విద్యార్థులలో ఎక్కువ మంది అక్కడ న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినోయిస్, మస్సాచూటెస్, అరిజోనా వంటి ఆరు రాష్ట్రాలలోనే ఎక్కువగా చదువుకుంటున్నారని వెల్లడైంది.