ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం

ఆసియా గేమ్స్ 2023లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో తాము బరిలోకి దిగిన మొదటిసారే స్వర్ణ పతకం సాధించి సత్తాచాటింది.  చైనాలోని హాంగ్జౌ వేదికగా సోమవారం జరిగిన ఆసియాగేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్‍లో భారత్ 19 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించి, గోల్డ్ మెడల్‍ను టీమిండియా కైవసం చేసుకుంది.

ఈ ఫైనల్ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (45 బంతుల్లో 46 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42 పరుగులు) రాణించారు. లంక బౌలర్లలో ఉదేశిక ప్రబోధిని, సుగంధిక కుమారి, ఇనోక రణవీర చెరో రెండు వికెట్లు తీశారు. 

భారత బౌలర్లు సమిష్టిగా రాణించి స్పల్ప లక్ష్యాన్ని కాపాడి జట్టును గెలిపించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ టిటాస్ సాధు మూడు వికెట్లతో సత్తాచాటగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవిక వైద్య చెరో వికెట్ తీశారు. 

ఆసియా గేమ్స్‌లో తొలుత షూటింగ్‍ టీమ్ భారత స్వర్ణ పతక ఖాతా తెరువగా, ఇప్పుడు మహిళల క్రికెట్ జట్టు కూడా గోల్డ్ మెడల్ గెలిచింది. ఈ ఫైనల్‍ మ్యాచ్‍లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. అయితే, భారత ఓపెనర్ షెఫాలీ వర్మ (9) త్వరగా ఔటైంది. 

అనంతరం స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీలైనప్పుడల్లా బౌండరీలు సాధించారు. దీంతో 8.2 ఓవర్లలోనే 50 పరుగులకు చేరింది భారత్. స్మృతి, జెమీమా రెండో వికెట్‍కు 73 పరుగులు జోడించారు. అయితే, స్మతి మంధాన ఔటయ్యాక మరే బ్యాటర్ ఎక్కువ సేపు నిలువలేకపోయారు. స్మృతి, జెమీమా మినహా భారత బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 116 పరుగులకే టీమిండియా పరిమితమైంది.

టీమిండియా పేసర్ టిటా సాధు మూడో ఓవర్లో శ్రీలంక బ్యాటర్లు అనుష్క సంజీవని (1), వష్మీ గుణరత్నె (0)ను ఔట్ చేసింది. ఆ తర్వాత ఐదో ఓవర్లో లంక కెప్టెన్ చమరి ఆటపట్టు (12)ను కూడా సాధు ఔట్ చేసి టీమిండియాను ఆధిపత్యంలో నిలిపింది. హాసినీ పెరీరా (25), నిలాక్షి డిసిల్వ (23) కాసేపు నిలకడగా ఆడారు. అయితే పెరీరాను గైక్వాడ్, డిసిల్వను వస్త్రాకర్ ఔట్ చేశారు. ఆ తర్వాత ఒషాడి రణసింఘే (19) మినహా శ్రీలంక బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు నిలువలేకపోయారు.