రూ. 2 కోట్ల విలువైన టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ

తిరుమల కొండ మీద దొంగలు పడ్డారు. అయితే దొంగలు భక్తుల ఫోన్లో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని వస్తువులో కాకుండా ఏకంగా ఓ ఎలక్ట్రిక్ బస్సును అపహరించారు. తిరుమల కొండ మీద భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ఉపయోగించే ధర్మరథాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. 
 
ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ బస్సు విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. తెల్లవారు జామున తిరుమల జీఎన్సీ టోల్ గేట్ మీదుగా తిరుపతికి వస్తున్న బస్సును టోల్‌ గేట్ వద్ద ఉండే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆపకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.
 
శనివారం రాత్రి ఛార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు ఛార్జింగ్ కు నిలిపాడు డ్రైవరు . ఉదయం ఛార్జింగ్ స్టేషన్ వద్ద వచ్చి చూడటంతో బస్సు కనిపించకపోవడంతో డ్రైవరు అధికారులకు సమాచారం అందజేశారు. ఉదయం నుంచి ఉచిత బస్సు టీటీడీ డిపోలో లేకపోవడంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలను సిబ్బంది తనిఖీ చేసి బస్సు చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. 
 
దీంతో తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి‌ పోలీసులు జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. 
ఉచిత బస్సు తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద ఉన్నట్లు క్రైం పోలీసులు గుర్తించారు. బస్సును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ దాన్ని నడుపుకుంటూ వెళ్లి నాయుడుపేట నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పరారయ్యాడు.
 
ప్రసుత్తం తిరుమలలో నడుస్తున్న కొత్త విద్యుత్ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉండటంతో నాయుడుపేట వద్ద బస్సు ఉందని తెలుసుకున్న అధికారులు నాయుడుపేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఉదయం 10 గంటల నాయుడుపేట ప్రాంతంలో పోలీసులు ఆపడంతో బస్సును ఆపిన దొంగలు ఉడాయించారు.
 
ఈ మేరకు టిటిడి రవాణా శాఖ తిరుమల క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది. కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బస్సు ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తిరుమల లాంటి పుణ్య క్షేత్రంలో బ్రహోత్సవాలు జరుగుతుండగా టీటీడీకి చెందిన బస్సు చోరీకి గురి కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
 
వైవీ సుబ్బారెడ్డి హయాంలో పర్యావరణ పరిరక్షణ కోసం టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల విలువ చేసే బస్సును రూ.40 లక్షల సబ్సిడీ ధరకే టీటీడీ సమకూర్చుకుంది. మేఘా సంస్థకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి నెలలో టీటీడీకి పది ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా పది ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా ఇచ్చింది. 
 
 తిరుమలకు ఆర్టీసీ సైతం రోజూ 65 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఇది ఇలా ఉంటే వారంరోజుల క్రితం టిటిడి హెల్త్ విభాగం ఉద్యోగి కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.. దానిని ఒంటిమిట్ట వద్ద వదిలి వెళ్లారు..