నవదీప్‌ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్‌

మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ  నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించారని తెలిపారు.

అయితే, నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, ఆధారాలు ముందు పెట్టి అడిగిన ప్రశ్నలకు నవదీప్ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. కానీ, టీఎస్‌ నాబ్‌ అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, టీఎస్‌ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉన్నదని నవదీప్ పేర్కొన్నారు.
 
ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారిస్తున్నారని, బీపీఎం అనే క్లబ్‌తో తనకున్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు. కొంత సమాచారం తెలుసుకునేందుకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారని పేర్కొంటూ అయితే, తానెప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదని నవదీప్‌ స్పష్టం చేశారు. విశాఖకు చెందిన రామచంద్‌ దగ్గర నేను డ్రగ్స్‌ కొనలేదని, గతంలో పబ్‌ నిర్వహించినందుకే తనను విచారించారని చెప్పారు. 
 
గతంలో సిట్‌, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణలో నార్కోటిక్‌ పోలీసులు విచారిస్తున్నారని పేర్కొన్నారు. నార్కోటిక్‌ అధికారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని వివరించారు.  అయితే, నవదీప్‌ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  
 
నవదీప్ నుంచి డ్రగ్స్ సినీపరిశ్రమలోని మిగతా వారికి సరఫరా అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సమయంలో కాల్‌లిస్ట్‌ను ముందుంచి విచారణ జరిపినట్లుగా తెలుస్తున్నది. వాట్సాప్‌ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. డేటా అందించిన తర్వాత మరోసారి నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు వివరించారు.