అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో ప్రధాని ఎన్నికల శంఖారావం

 
మరి కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండగా ఈ పర్యాయం తెలంగాణాలో పాగా వేసేందుకు పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ  భారీ బహిరంగసభలు, రోడ్ షో లతో ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు పురపాలికలోని ఐటీఐ మైదానం వేదికగా మధ్యాహ్నం 1 గంటకు జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని బిజెపి నాయకులు వెల్లడించారు. ఈ సభ ద్వారా ఆయన రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డి తెలిపారు.
ఇక ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో ఉంది. లక్ష మందికి పైగా సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గానికి 20 వేల మందికి తగ్గకుండా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ బహిరంగసభ పూర్తి కాగానే ప్రధాని మోదీ నిజామాబాద్ కూడా పర్యటించగలరని చెబుతున్నారు. ఆ నగరంలో ఆయన రోడ్ షో జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణాలో కొన్ని బహిరంగసభలలో పాల్గొన్నారు.  త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ కూడా త్వరలోనే జాబితాను ప్రకటించే కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీడబ్ల్యూసీ భేటీతో పాటు విజయభేరి సభను నిర్వహించింది కాంగ్రెస్  గ్యారెంటీ కార్డుతో జనాల్లోకి వెళ్తోంది. 
 
ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని,  ఎవ్వరికీ ఓటు వేసినా ఒకటే అనే నినాదంతో బిజెపి ప్రచారం చేస్తున్నది.