సమైక్యతతో ప్రపంచ సంక్షోభాలను అధిగమించాలి

 
సమైక్యతతో వ్యవహరిస్తూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలను అధిగమించాలని, అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ప్రపంచ నేతలు కోరారు. యుక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ, వాతావరణ మార్పు, ప్రజారోగ్యం,భౌగోళిక రాజకీయ అస్థిరత పరిష్కరించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) మంగళవారం వారం రోజులపాటు జరిగే సమావేశాలు ప్రారంభమయ్యాయి. 
 
“విశ్వాసాన్ని పునర్నిర్మించడం, ప్రపంచ సంఘీభావాన్ని పునరుజ్జీవింపజేయడం: 2030 ఎజెండాపై చర్యను వేగవంతం చేయడం, అందరికీ శాంతి, శ్రేయస్సు, పురోగతి, స్థిరత్వం వైపు దాని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు” లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి విధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ అభివృద్ధిపై, వాతావరణ మార్పులపై పేద, వర్ధమాన దేశాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి.
 
 కాగా మరోవైపు, అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభంపై తమ ఆందోళనలను వ్యక్తం చేసేందుకు ఈ బహుళ వేదికను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.  దాంతో, కరోనా తర్వాత మొదటిసారిగా జరిగిన పూర్తి స్థాయి సమావేశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
అనేక వర్ధమాన దేశాలు తీవ్రమైన అభివృద్ధి సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 2030 ఎజెండా, దాని సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై శీఘ్రగతిన కార్యాచరణ ఎలా వుండాలనే దానిపై ఈ ఏడాది సమావేశాల్లో ప్రధానం గా దృష్టి పెట్టాల్సి వుంది. 
అయితే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశాలకు హాజరు కావడంతో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల కూటమి, అభివృద్ధిని భౌగోళిక రాజకీయాలు ముడిపెట్టక తప్పడం లేదు.  ”ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రజలు తమ నేతల వైపు చూస్తున్నారు.” అంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ సమావేశాలకు ముందు వ్యాఖ్యానించారు.  బహుళ రకాలైన సంక్షోభాలు, ఘర్షణలను ప్రతిబింబించేలా ఈ ఏడాది సమావేశాల్లో 145 మంది నేతలు ప్రసంగించనున్నారు.
 
అధ్వాన్నమవుతున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న అంతర్జాతీయ జీవన వ్యయ సంక్షోభం, నాటకీయమైన సాంకేతిక అవాంతరాలు వంటి పలు సవాళ్ళను ఎదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో మాటల కన్నా చేతలకే ప్రాధాన్యత వుండాలని గుటెరస్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ విభజనలనేవి ప్రతిస్పందించే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
 

కాగా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో పాటు భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ల నేతలు ఎవ్వరూ సమావేశాలకు హాజరుకాలేదు. ఫ్రాన్స్,  బ్రిటన్ మంత్రుల ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది.

 
ఈ సమావేశాల సందర్భంగా ప్రపంచ నాయకులను ఉద్దేశించి “మేము ఉక్రెయిన్‌ను ముంచేయడానికి అనుమతిస్తే” ఏ దేశం సురక్షితంగా ఉండదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. “ఈ యుద్ధానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఈ యుద్ధాన్ని వెంటనే ముగించే శక్తి రష్యాకు మాత్రమే ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సదస్సులో భారత్- మధ్య తూర్పు- ఐరోపా  ఎకనామిక్ కారిడార్ ఏర్పర్చేందుకు తీసుకున్న నిర్ణయాన్ని బిడెన్ ప్రస్తావిస్తూ  “అద్భుతమైన ప్రయత్నంలో మేము యుఎఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ ల ద్వారా భారతదేశాన్ని ఐరోపాకు కనెక్ట్ చేయడానికి జి20 సదస్సులో ప్రకటించాము” అని వెల్లడించారు.