కెనడాలో హిందువులకు ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరింపు

జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని, నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆరోపించడం ఆ దేశంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇచ్చిన్నట్లయింది. వారు భారత్ పై, ముఖ్యంగా హిందువులపై రెచ్చిపోతున్నారు.
 
తాజాగా, కెనడాలో ఉన్న హిందువులను దేశం విడిచి వెళ్లిపొమ్మని ఓ ఉగ్రవాది బహిరంగంగా హెచ్చరించాడు.  భారత్ అనుకూల హిందువులు వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖలిస్థాన్ ఉగ్రవాది స్పష్టం చేశాడు. ‘మీ గమ్యం భారత్‌. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి’ అని కెనడాలోని భారతీయ హిందువులును తాజా వీడియోలో బెదిరించాడు.
 
ఖలిస్తాన్ అనుకూల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న భారతీయ హిందువులు కెనడా నుంచి వెళ్లిపోవాలని సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్ర సంస్థ న్యాయవాది గురుపత్వంత్ పన్నున్ హెచ్చరించారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరస్ అయింది. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థను భారత్ లో 2019లో నిషేధించారు. పన్నున్ ను ఉగ్రవాదిగా నిర్ధారించారు.

‘‘కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలి. వారు భారత్ కు వెళ్లి పోవాలి. భారత్ కు మద్దతిస్తున్నవారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఖలిస్తాన్ విషయంలో మీరు మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు, ఖలిస్తాన్ అణచివేతను కూడా మద్దతు ఇస్తున్నారు. ఖలిస్తానీ సిక్కుల భావ ప్రకటన స్వేచ్ఛ ను వ్యతిరేకిస్తున్నారు’’ అని ఆ వీడియోలో గురుపత్వంత్ పన్నున్ హెచ్చరించాడు.