ఏఎన్నార్ విగ్రవిష్కరణతో అక్కినేని శత జయంతి ఉత్సవాలు

తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం  అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడియోలో ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అక్కినేని లోని వ్యక్తిత్వాన్ని కొంచెం అయినా నేర్చుకొని అవి అమలు చేస్తే అదే ఆయనికి నిజమైన నివాళి అని చెప్పారు. జీవితంలో ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి మరెవరు లేరని కొనియాడారు. 
 
సినిమా రంగంలో విలువలు పాటించి, చూపించి కొన్ని మంచి సంప్రదాయాలు మనముందు పెట్టిన వారిలో సజీవ మనిషి అక్కినేని అని కొనియాడారు. అక్కినేని మహానటుడు, మహా మనిషి అని, నాగేశ్వరరావు ఇక్కడే ఉన్నారా అన్నట్లు శిల్పం చెక్కారని ప్రశంసించారు. నాగేశ్వరరావు ఒక నటనా విశ్వవిద్యాలయం అని చెబుతూ ఇక్కడకి వచ్చిన వాళ్ళు విద్యార్ధి అనుకొని అయన నుంచి కొన్నిటిలో అయినా స్ఫూర్తి పొంది వాటిని అందించుకుంటే తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోగలరని సూచించారు.

హీరోలు రామ్‌ చరణ్‌, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌ను గుర్తుచేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

‘అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’  అని పేరొన్నారు.