జాతీయ విద్యావిధానం అమలు దిశగా విద్యాభారతి కృషి

జాతీయ విద్యావిధానం అమలు దిశగా విద్యాభారతి కృషి
దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు(ఎన్ సీ ఈ ఆర్ టీ)  చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో తమ నిపుణుల బృందం  తోడ్పాటు అందిస్తోందని వివరించారు.
 
 విద్యాభారతి  జాతీయ ప్రధాన కార్యదర్శి అవినీష్ భట్నాగర్ తో కలిసి ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గోరఖ్ పూర్ కేంద్రంగా 1952 లో మొగ్గ తొడిగిన శ్రీ సరస్వతీ శిశుమందిర్  లు 1977 నుంచి విద్యాభారతి పేరుతో ఒక కేంద్రీక్రత వ్యవస్థ గా పనిచేస్తున్నాయి.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 వేలకు పైగా రెగ్యులర్ పాఠశాలలు, 9 వేలకు  పైగా పాక్షిక విద్యాలయాల్ని నిర్వహిస్తోంది. 
 
ఈ పాఠశాలల్లో  లక్షన్నర కు పైగా ఆచార్యులు విద్య బోధిస్తుండటంతో 35 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు.
భారత్ కేంద్రిత విద్యా వ్యవస్థను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్న జాతీయ విద్యావిధానం 2020 పూర్తి స్థాయిలో అమలు చేయటానికి విద్యాభారతి తనవంతు కృషి చేస్తున్నది. 
 
విద్యాలయం కేంద్రంగా సామాజిక సేవ, అన్ని రకాలుగా విద్యార్థులు సర్వాంగీణ వికాసం పొందటం, పంచకోశాత్మక విద్యను నేర్చుకోవటం, సమగ్ర వికాసం వంటి లక్ష్యాలను విద్యాభారతి నెరవేరుస్తున్నది. ఇటువంటి సమగ్రమైన శాస్త్రీయమైన వికాసం కోసమే జాతీయ విద్యా విధానం పెద్ద పీట వేయటం హర్షించదగిన విషయం. 
 
అందుచేతనే ఈ దిశగా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా స్థాయిలో పాఠ్య  పుస్తకాల తయారీలో ఎన్ సీ ఈ ఆర్ టీ కి తమ నిపుణుల టీమ్ సహాయ సహకారం అందిస్తున్నది అని రామకృష్ణారావు వివరించారు.  ఈశాన్య రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లోని  గిరిజన ప్రాంతాల్లో వెయ్యికిపైగా రెసిడెన్షియల్ పాఠశాలల్ని విద్యా భారతి నిర్వహిస్తున్నది. దీంతో పాటు 20వేలకు పైగా గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నది. 
 
దేశ సరిహద్దుల్లో ఇప్పటికే 200 కు పైగా పాఠశాలల్ని నడుపుతోంది. 11 చోట్ల సైనిక్ స్కూల్స్ ను విద్యాభారతి ఏర్పాటు చేసిందని రామకృష్ణారావు గుర్తు చేశారు. ఉన్నత విద్య లో 53 డిగ్రీ కళాశాలల్ని నడుపుతోందని, గౌహతి కేంద్రంగా ఒక యూనివర్శిటీ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక విద్య ను విస్తరించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థలో పరిశోధనల కోసం లక్నో కేంద్రంగా భారతీయ శిక్ష శోధ్ సంస్థాన్, శిశు, ప్రాథమిక స్థాయి పిల్లల విద్యలో పరిశోధనల కోసం గాంధీధామ్ లో సమర్థ్ భారత్ అనుసంధాన్ కేంద్ర పేరుతో మరో పరిశోధన కేంద్రం సేవలు అందిస్తున్నాయి. నిరంతరాయంగా ఉపాధ్యాయుల్లో నాణ్యత పెంచేందుకు విభిన్న ప్రాంతాల్లో శిక్షణ వ్యవస్థలు  పనిచేస్తున్నాయి. 

 
భోపాల్ కేంద్రంగా పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు మాణిక్ పరిషద్ పేరుతో ప్రత్యేక పరిశోధన కేంద్రం పనిచేస్తున్నది. 25లక్షలకు పైగా విద్యార్థుల్ని సమన్వయం చేసుకొంటూ కురుక్షేత్ర కేంద్రంగా సాంస్క్రతిక పరిశోధనల కోసం విద్యా భారతి సంస్క్రతి శిక్ష సంస్థాన్ అనే పరిశోధన కేంద్రం పనిచేస్తోందని రామకృష్ణారావు వివరించారు.

ప్రతీ ఏటా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే బోర్డు పరీక్షల్లో విద్యాభారతి విద్యార్థులు ఉన్నత ర్యాంకులు పొందుతున్నారు. 40 లక్షలకు పైగా పూర్వ విద్యార్థులు విద్యాభారతి నుంచి సమాజంలోకి అడుగుపెట్టి పరిపాలన, జ్యూడిషీయరీ, ఇస్రో, స్పోర్ట్స్, రక్షణ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. దాదాపు 68 దేశాల్లో సాంస్క్రతిక రాయబారులుగా భారత దేశ గౌరవాన్ని నిలుపుతున్నారు. సమాజంలో కూడా వివిధ రంగాల్లో విద్యాభారతి పూర్వ విద్యార్థులు సేవలు అందిస్తున్నారని రామకృష్ణారావు వివరించారు.