మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

 
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశమైన కేబినెట్‌ ఆమోదించింది.  ఇంకా నాలుగు రోజుల పాటు నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు హాజరయ్యారు.
కాగా.. ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోదీ సమావేశాలకు ప్రారంభం అవ్వడానికి ముందు పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మంత్రివర్గంలో ఏయే నిర్ణయాలు తీసుకున్నారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు, 5 రోజుల పాటు జరగనున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లో 8 బిల్లులపై చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు.
ఐదు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు పార్టీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘమైన పోరాటం జరిగింది. మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనికి ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లు సభ ఆమోదం పొందలేదు. ఆ తరువాత లోక్‌సభలో బిల్లు రద్దయ్యింది. ఆ తరువాత రెండేళ్లకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998లో 12వ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి 1998లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా వాదించారు. అయితే అప్పుడు కూడా బిల్లుకు తగిన మద్దతు లభించలేదు. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అప్పుడూ బిల్లు పాస్‌ కాలేదు.

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ-1 ప్రభుత్వం మే 6, 2008న రాజ్యసభలో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది. మే 9, 2008న బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. ఈ నివేదికకు 2010 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర లభించింది. 

చివరికి మార్చి 9, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 186-1 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే లోక్‌సభలో మాత్రం ఎప్పుడూ పరిశీలనకు తీసుకోలేదు. 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో మళ్లీ ఈ బిల్లు అటకెక్కింది. తాజాగా ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది.

కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిధ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని, ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అంటూ సంతోషం వ్యక్తం చేశారు.