
ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్గాలకు సంతృప్తి కలిగించలేకపోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజున పాత పార్లమెంట్ భవన్ లో జరిగిన చివరి సమావేశంలో ఇక్కడి తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోదీ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరగగా అన్ని చోట్లా సంబరాలు జరిగాయని, అయితే ఆంధ్రప్రదేశ్ విభజన ఏపీ, తెలంగాణ వర్గాలనూ సంతృప్తిపరచ లేకపోయిందని ప్రధాని స్పష్టం చేశారు.
కాగా, తమ ప్రభుత్వం హయాంలో ఇక్కడ తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి), ట్రిపుల్ తలాక్ రద్దు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపి) వంటి చరిత్రాత్మక నిర్ణయాలను పాత భవనంలో పార్లమెంటు తీసుకున్న చరిత్ర, సభ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ప్రధాని తెలిపారు.
“ఈ సభలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, అనేక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారాలు జరిగాయి. ఆర్టికల్ 370 (రద్దు) దాని వల్లే సాధ్యమైందని సభ ఎప్పుడూ గర్వంగా చెబుతుంది. ఇక్కడ జిఎస్‌టి కూడా ఆమోదించబడింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కు ఈ సభ సాక్షి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు దేశంలో మొదటిసారిగా ఎలాంటి వివాదం లేకుండా విజయవంతంగా అనుమతించబడ్డాయి” అని ప్రధాన మంత్రి వివరించారు.
సభా కార్యక్రమాలలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం మరియు సహకారాన్ని మోదీ ప్రస్తావిస్తూ అంతకుముందు వారి సంఖ్య తక్కువగా ఉండగా, సంవత్సరాలుగా అవి నిరంతరంగా పెరిగాయని ఆయన తెలిపారు. దాదాపు 600 మంది మహిళా ఎంపీలు ఉభయ సభల గౌరవాన్ని పెంచారని కొనియాడారు. పార్లమెంటు
సాధించిన అతిపెద్ద విజయం ఆ సంస్థపై ప్రజలకు “ఎప్పటికప్పుడూ పెరుగుతున్న” విశ్వాసమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు పాత భవనానికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవాలని ఎంపీలను కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
More Stories
వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
కాంగ్రెస్ ను నడిపిస్తున్న `అర్బన్ నక్సల్స్’
ఇది లిక్కర్ గ్యారంటీ సర్కారు.. బొమ్మై ఆగ్రహం!