పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు

 సోమవారం ప్రారంభమైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రత్యేక సెషన్‌ కాలవ్యవధి తక్కువే కావచ్చు కానీ సందర్భానుసారంగా పెద్దదని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ  అనేక కారణాల వల్ల ఈ సమావేశం చరిత్రలో నిలవబోతోందని, విశ్వాసం, ఉత్సాహంతో జరుగుతోందని దీమా వ్యక్తం చేశారు.

తక్కువ సమయమే ఉండే ఈ చిన్న సెషన్‌కు కొంత సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలను ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు పార్లమెంటు సభ్యులందరినీ తాను అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ఏడుపులు, పెడబొబ్బులకు ఇతర సమయాలు ఉన్నాయని పేర్కొన్నారు. పండుగ వాతావరణం, ఉత్సాహంతో ఈ సమావేశం ఉంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని చెప్పారు. భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ20 సదస్సు మార్గదర్శనం చేసిందన్నారు. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.

మరోవైపు చంద్రయాన్-3 మిషన్‌ను మరోసారి ఆయన ప్రశంసించారు. మూన్ మిషన్ యొక్క విజయం దేశ జెండాను ఎగురవేసిందని గుర్తు చేశారు. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారిందని చెప్పారు. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోందని తెలిపారు. ప్రత్యేక సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కావడానికి ముందే పలువురు కీలక మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు.

స్పీకర్ అభినందనలు

కాగా, జీ20 అధ్యక్ష పదవిని విజయవంతం పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. జీ20 సదస్సులో తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని, ప్రపంచానికి కొత్త దిశను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సున్నితమైన విషయాలపై కూడా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. గత 9 సంవత్సరాలలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందో ఈ పరిణామం తెలియజేస్తోందని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభోపన్యాసంలో స్పీకర్ ఈ విధంగా స్పందించారు.