పాత పార్లమెంట్ భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి

కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పాత పార్లమెంట్‌ భవనంలో జరిగే చివరి సెషన్‌ చారిత్రాత్మకమైనదని పేర్కొంటూ తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 
 
భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది ఒక కీలకమైన ఘట్టమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారే నిర్ణయం తీసుకున్నప్పటికీ నిర్మాణానికి దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని ప్రధాని  కొనియాడారు. గత 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు.
 
ఈ సందర్భంగా, మాజీ రాష్ట్రపతిలందరి పాత్రలను ప్రధాన మంత్రి కొనియాడారు. వారు తమ ప్రసంగాల ద్వారా సభకు, దేశానికి మార్గనిర్దేశం చేశారని చెప్పారు. “డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుండి అబ్దుల్ కలాం నుండి రామ్ నాథ్ కోవింద్ వరకు, మన సభలు వారి ప్రసంగాల నుండి ప్రయోజనం పొందాయి. వారు సభకు మార్గనిర్దేశం చేసారు. పండిట్ నెహ్రూ, శాస్త్రి జీ నుండి అటల్ జీ, మన్మోహన్ సింగ్ వరకు ఈ సభకు నాయకత్వం వహించారు. దేశానికి దిశానిర్దేశం చేశారు” అంటూ మోదీ గుర్తు చేశారు. 
 
దేశానికి కొత్త రూపాన్ని అందించడానికి వారు చాలా కష్టపడ్డారని, వారందరినీ ప్రశంసించాల్సిన సందర్భమిదని ప్రధాని మోదీ తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పార్లమెంటులో  “అర్ధరాత్రి సమయంలో” ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి, సభ్యులందరికీ ఇది స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
 
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లోక్‌సభలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి, పడిపోతాయి, కానీ దేశం అలాగే ఉండాలని చేసిన ప్రసిద్ధ ఉల్లేఖనాన్ని కూడా మోదీ ప్రస్తావించగారు. ‘‘ఈ సభలో పండిట్ నెహ్రూ చేసిన ‘‘అర్ధరాత్రి వేళ..’’ అన్న ప్రతిధ్వనులు మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. ఈ సభలోనే అటల్ జీ ఇలా అన్నారు. ‘‘సర్కరీన్ ఆయేగీ-జాయేగీ, పార్టీయన్ బనేగీ-బిగ్డేగీ, లేకిన్ యే దేశ్ రెహ్నా. చాహియే (ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, పార్టీలు ఏర్పడతాయి.  పోతాయి, కానీ దేశం ఉండాలి). ఇది నేటికీ ప్రతిధ్వనిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని, 1975లో మాజీ ప్రధాని విధించిన ఎమర్జెన్సీ గురించి కూడా గుర్తు చేశారు. “ఇందిరా గాంధీ నాయకత్వంలో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని, దానికి లభించిన మద్దతును ఈ పార్లమెంటు చూసింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంపై దాడిని కూడా ఇదే పార్లమెంటు చూసింది. ఈ పార్లమెంటు భవనం కూడా ఎమర్జెన్సీని చూసింది. ఓట్ల కోసం నగదు కుంభకోణంను చూసింది” అని వివరించారు. 
 
భారత్ సాధించిన విజయాలపై నేడు ప్రపంచం చర్చిస్తోందని, చంద్రయాన్-3 విజయం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని మోదీ  పునరుద్ఘాటించారు. ఈ పార్లమెంట్ దేశ శాస్త్రవేత్తలను అభినందిస్తుందని అని మోదీ తెలిపారు.
 
ఇటివలే విజయవంతంగా ముగిసిన జీ20 సదస్సును ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావిస్తూ జీ20కి అధ్యక్షత వహించడం భారతదేశానికి చెందిన విజయం అవుతుందచెప్పారు. వ్యక్తులకో లేదా పార్టీలకో అపాదించరాదని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అపేర్కొన్నారు. భారత్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇందుకు దేశ సంస్కృతి, వేదాల నుండి వివేకానందుడి వరకు ప్రతిదీ కారణమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోతున్నానని ప్రధాని చెప్పుకొచ్చారు. దేశం నుంచి ఇంతటి ప్రేమ, గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదని చెప్పారు. రైల్వే స్టేషన్‌ ప్లాట్‌‌ఫామ్‌పై నిద్రించిన చిన్నారి ఏదో ఒక రోజు పార్లమెంటులో మాట్లాడతాడని ఊహించలేదని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని తెలిపారు.