40 శాతం సిట్టింగ్‌ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు

 పార్లమెంట్‌ ఉభయ సభల్లోని 40 శాతం మంది సిట్టింగ్‌ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఎడిఆర్‌ సంస్థ వెల్లడించింది. ఇందులో 25 శాతం మందిపై (194 మంది ఎంపీలు) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని పేర్కొంది.  నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థతో కలిపి సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించి, వివరాలను వెల్లడించింది. ఉభయ సభల్లో 776 మంది ఎంపీలు ఉండగా, 763 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించింది. 763 మంది ఎంపీల్లో 306 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. 

కాగా, ఇరుసభల్లోని ఎంపీల సగటు ఆదాయం రూ.38.33 కోట్లుగా ఉంది. ఇందులో 53 మంది అంటే 7 శాతం మంది బిలియనీర్లు. ఉభయ సభల్లో క్రిమినల్‌ కేసులు నమోదైన వారిలో రాష్ట్రాలవారీగా చూస్తే కేరళ నుంచి 29 మంది ఎంపీలకు గాను 23 మందిపై (79 శాతం), బీహార్‌ నుంచి 56 మందికి గాను 41 (73 శాతం), మహారాష్ట్ర నుంచి 65 మందికి 37 (57 శాతం), తెలంగాణ నుంచి 24 మందికి గాను 13 (54 శాతం), ఢిల్లీ నుంచి 10 మందికి గాను 5గురిపై (50 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో బీహార్‌ నుంచి 28 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 22 మంది, ఉత్తర ప్రదేశ్‌ నుంచి 37 మంది ఉన్నారు. బిజెపి నుంచి 139 మంది, కాంగ్రెస్‌ నుంచి 43 మంది, టిఎంసి నుంచి 14 మంది, ఆర్‌జెడి నుంచి ఐదుగురు, వైసిపి నుంచి 13 మంది క్రిమినల్‌ కేసులు కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే బిజెపి నుంచి 98 మంది (25 శాతం), కాంగ్రెస్‌ నుంచి 26 మంది (32 శాతం), టిఎంసి నుంచి ఏడుగురు (19 శాతం), ఆర్‌జెడి నుంచి ముగ్గురు (50 శాతం), ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఒకరు (9 శాతం), వైసీపీ నుంచి 11 మంది (35 శాతం), ఎన్‌సిపి నుంచి 2 (25 శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు కలిగి ఉన్నారు.

ఇక ఎంపీల ఆస్తుల విషయానికి వస్తే తెలంగాణ 24 మందితో మొదటి స్థానంలో ఉంది. సగటు ఆస్తి రూ.262.26 కోట్లుగా ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ నుంచి 36 మంది (సగటున రూ.150.76 కోట్లు), పంజాబ్‌ 20 మంది (సగటున 88.94 కోట్లు) ఉన్నారు. అందరి కంటే తక్కువగా లక్ష్వద్వీప్‌ ఎంపీ రూ.9.38 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. 

ఆ తర్వాత త్రిపుర ముగ్గురు ఎంపీల సగటు ఆస్తి రూ.1.09 కోట్లు, మణిపూర్‌ నుంచి ముగ్గురి సగటు ఆస్తి రూ.1.12 కోట్లుగా ఉంది. బిజెపి ఎంపీల సగటు ఆస్తి రూ.18.31 కోట్లు, కాంగ్రెస్‌ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లు, టిఎంసి ఎంపీల సగటు ఆస్తి రూ.8.72 కోట్లుగా ఉంది.  ఇక, వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లు, టిఆర్‌ఎస్‌ ఎంపీల సగటు ఆస్తి రూ.383.51 కోట్లు, ఎన్‌సిపి ఎంపీల సగటు ఆస్తి రూ.30.11 కోట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీల సగటు ఆస్తి రూ.119.84 కోట్లుగా ఉంది. 

53 మంది బిలియనీర్‌ ఎంపీలలో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి ఇద్దరు, పంజాబ్‌ నుంచి నలుగురు, ఉత్తరాఖండ్‌ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఆరుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు ఉన్నారు. వీరంతా రూ.100 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారు. రూ.100 కోట్ల ఆస్తిని కలిగి ఉన్న ఎంపీలలో బీజేపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు ఉన్నారు.