
శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు.
ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు. శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26వకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రోజుకు లక్ష మంది వస్తారని అంచనా వస్తున్నారు. గరుడ సేవ రోజు తిరుమలకు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట.
అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు.
More Stories
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్