ఎనిమిదోసారి ఆసియా కప్ 2023 విజేత భారత్

ఎనిమిదోసారి ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. అతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లు సునాయసంగా పూర్తి చేయడంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే భారత్ జయభేరి మోగించింది. 
 
అంతకుముందు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/21) విశ్వరూపంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. కాగా 7 సంవత్సరాల తర్వాత టీమిండియా మళ్లీ ఆసియా కప్ గెలిచింది. భారత జట్టు చివరి సారిగా 2016లో ఆసియా కప్ గెలిచింది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది 8వ సారి. దీంతో అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ మరింత మెరుగుపరుచుకుంది. 
 
అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్జు ఆసియా కప్ గెలవడం ఇది రెండోసారి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2016లో కూడా భారత జట్టు ఆసియా కప్ గెలిచింది. లక్ష్యం చాలా చిన్నది కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకుని ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌ను పంపించాడు. దీంతో గిల్, కిషన్ భారత జట్టును సునాయసంగా గెలిపించారు.
 
ప్రమోద్ మదుషన్ వేసిన 3వ ఓవర్‌లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. మొత్తంగా 6.1 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసింది. అంటే మరో 43.5 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిచింది. 27 పరుగులు చేసిన గిల్, 23 పరుగులు చేసిన కిషన్ నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ చావు దెబ్బ తగిలింది.
శ్రీలంకను సిరాజ్ గజగజ వణికించాడు. మొదటి ఓవర్‌లోనే కుశల్ పెరీరాను జస్రీత్ బుమ్రా డకౌట్ చేశాడు. బుమ్రా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు. ఇక మహ్మద్ సిరాజ్ ఎంట్రీతో శ్రీలంక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆరంభం నుంచి సిరాజ్ నిప్పులు కక్కాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో ఒక పరుగు కూడా రాలేదు. దీంతో ఆ ఓవర్ మెయిడెన్ అయింది. ఇక 4వ ఓవర్‌లో విశ్వరూపం చూపించాడు. ఆ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టి లంకేయులు నడ్డి విరిచాడు. 
 
తాను వేసిన 4వ ఓవర్‌లో వరుసగా నిసాంక(2), సదీర సమరవిక్రమ(0), చరిత అసలంక(0), దనుంజయ డిసిల్వాను(4) పెవిలియన్ చేర్చాడు. దీంతో అతిథ్య జట్టు శ్రీలంక 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ మొదటి బంతికే నిసాంక ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా అద్భుతంగా అందుకున్నాడు. రెండో బంతి డాట్ అయింది. మూడో బంతికి సమర విక్రమ లెగ్‌బైస్‌లో ఔట్ అయ్యాడు. 
 
నాలుగో బంతికి అసలంక ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ అందుకున్నాడు. ఐదో బంతి ఫోర్ వెళ్లింది. ఆరో బంతికి డి సిల్వా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు. దీంతో ఈ ఓవర్‌లో సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్‌ సిరాజ్ బంతి వేస్తే వికెట్ అన్నట్టుగా సాగింది. సిరాజ్ కెరీర్‌లోనే ఇది డ్రీమ్ స్పెల్‌గా నిలిచిపోయింది.

ఆరో ఓవర్‌లో మరోసారి చెలరేగిన సిరాజ్ శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను డకౌట్ చేశాడు. శనక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 పరుగులకే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ 10 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన సిరాజ్ క్రీజులో కుదురుకున్న కుశల్ మెండీస్(17)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.  ఆ తర్వాతి ఓవర్‌లోనే దునిత్ వెల్లలాగేను(8)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 

దీంతో 40 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగతా రెండు వికెట్లను హార్దిక్ పాండ్యా 16వ ఓవర్ మొదటి రెండు బంతులకే పడగొట్టాడు. ప్రమోద్ మదుషన్(1), మతీషా పతిరాన(0)ను పెవిలియను చేర్చాడు. దీంతో 15.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో చేయాల్సింది 51 పరుగలు మాత్రమే.

శ్రీలంక వన్డే చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోర్. అలాగే వన్డేల్లో టీమిండియాపై ఓ ప్రత్యర్థి సాధించిన అత్యల్ప స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఇక లంక బ్యాటర్లలో 13 పరుగులు చేసిన దుషన్ హేమంత నాటౌట్‌గా నిలిచాడు. 17 పరుగులు చేసిన కుశల్ మెండీసే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  శ్రీలంక బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. ముగ్గురిని సిరాజే డకౌట్ చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విశ్వరూపం చూపించాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

హార్దిక్ పాండ్యా 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. 5 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. శ్రీలంక వికెట్లన్నీ మన పేసర్లే తీయడం గమనార్హం. స్పిన్ పిచ్‌పై మన పేసర్లు ఈ స్థాయిలో చెలరేగడం అద్భుతమనే చెప్పుకోవాలి. కాగా ఈ నెల 12న జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై మన వికెట్లన్నీ శ్రీలంక స్పిన్నర్లే తీయగా, 5 రోజుల తర్వాత తాజాగా అదే పిచ్‌పై శ్రీలంక వికెట్లన్నీ మన పేసర్లే తీయడం గమనార్హం.