చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో టీడీపీ- వైసీపీ ఎంపీల వాగ్వాదం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీ మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అరెస్టు విషయాన్ని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ప్రస్తావించడంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుని ఉద్దేశిస్తూ…కూర్చోరా, కూర్చోరా బాబు అంటూ హేళనగా మాట్లాడారు. 
 
ఎంపీ మిథున్ రెడ్డి అనుంచిత వ్యాఖ్యలను, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై నోరు పారేసుకున్న విధానాన్ని టీడీపీ ఎంపీలు ఖండించారు. సహచర ఎంపీ అన్న కనీస గౌరవ మర్యాదలు లేకుండా రామ్మోహన్ నాయుడుని ఏకవచనంతో మిథున్ రెడ్డి మాట్లాడడంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు సీనియర్ ఎంపీలు తప్పుబట్టారు.
పార్లమెంట్ లో మిథున్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు హస్తం ఉందని చెప్పిన మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఖందించారు.  చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని అంటూ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావింఛారు. తమ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, స్కిల్ స్కామ్ లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కాకుండానే అరెస్టు చేశారని ఆరోపించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.  చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రధాని, హోంమంత్రి దృష్టి పెట్టాలని కోరారు. ఐటీని చంద్రబాబు ప్రోత్సహించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని, అనేక సంస్కరణలతో ప్రగతి సారథిగా నిలిచారని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని స్పష్టం చేశారు.

అయితే, లోక్ సభలో టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ ను ప్రస్తావించడంపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ప్రస్తావించొద్దని వారించారు. టీడీపీ ఎంపీ జయదేవ్ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తప్పుబట్టారు.  స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని, ఫేక్ జీవోలు ఇచ్చి రూ.371 కోట్లు లూటీ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో నగదు ఎక్కడికెళ్లిందో ఈడీ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఐటీ కేసులో సైతం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయారని మిథున్ రెడ్డి ఆరోపించారు.