
క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం ఏపీ జనాభాలో 35 శాతం మద్యం సేవిస్తారని, కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 15 శాతం మద్యం సేవిస్తారని, కేంద్రం అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 80 లక్షల మంది రోజుకు రూ.200 మద్యం సేవిస్తే వాటి ద్వారా రోజుకు రూ.160 కోట్లు వస్తాయని, నెలకు రూ.4800 కోట్లు, ఏడాదికి రూ.56,600కోట్లు వస్తాయని ఆమె చెప్పారు.
అయితే, రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం రూ. 20 వేల కోట్లు మాత్రమే లెక్కలు చూపిస్తున్నారని చెబుతూ మిగిలిన రూ.25 వేల కోట్లు ఏమవుతున్నాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, గ్రామాల్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు నేరుగా ఇళ్లలోనే అమ్ముకునేలా చేస్తున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.
లిక్కర్ బాండ్ల ద్వారా రూ.10వేల నిధులు సేకరించారని, అందులో ఉన్న నిబంధనల్లో మద్యం పాలసీ మార్చేది లేదని, నిషేధం విధించనని అంగీకరించారని మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 2019లో సిఎంగా జగన్ పగ్గాలు చేపట్టాక మద్యంపై ఆదాయాన్ని తగ్గించి, రిహబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, 2024నాటికి మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంచి, ఎన్నికలకు వెళతానని ప్రకటించారని ఆమె గుర్తు చేశారు.
గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారని, తెల్లారకముందే మద్యం దుకాణాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారని, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని జగన్ చెప్పారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు మాత్రం మద్యం యదేచ్ఛగా విక్రయిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కార్పొరేషన్ సరఫరా చేస్తోందని, ఐఎంఎఫ్‌ఎల్ యాక్ట్‌లో తమకు అనుగుణంగా మార్చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.
మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తానని జగన్ చెప్పారని, మద్యం, ఆరోగ్యం గురించి మాట్లాడారని పేర్కొంటూ మద్యంలో ఎంత అవినీతి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని పురందేశ్వరి కోరారు. గతంలో ఉన్న బ్రాండ్లు కాకుండా ఇప్పుడు కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయని , రకరకాల కొత్త పేర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.
అగ్రోస్, ఎస్పీవై అగ్రోస్, బయోటెక్, చిత్తూరులో మోహన్ బెవరేజిస్, విశాఖలో జిఎస్పీ వంటి సంస్థలు మద్యం తయారు చేస్తున్నాయని, గతంలో ఉన్న సంస్థలను బెదిరించి వాటిని వారి నుంచి లాక్కున్నారని, కేసులు పెడతామని బెదిరించి వాటిని తమ పార్టీ వారికి కట్టబెట్టారని పురందేశ్వరి ఆరోపించారు.
అధికార పార్టీ ఎంపీ ఒకరు తన కంపెనీని ప్రభుత్వానికి ఇవ్వను అన్నందుకు అతని కంపెనీ మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. ఎక్కడైనా మొలాసిస్‌కు ఈస్ట్ కలిపి తయారయ్యే రెక్టిఫైడ్ స్పిరిట్ శుద్ధిచేసి వాటికి రంగులు, ఎసెన్స్‌లు కలిపి, తర్వాత నీటిని కలిపి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం తయారు చేయిస్తారని ఆమె చెప్పారు.
అయితే, రాష్ట్రంలో మాత్రం ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలను వేరు చేయకుండా నేరుగా తయారు చేస్తున్నారని బీజేపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. రూ.15తో తయారయ్యే లీటర్ మద్యాన్ని రూ.600 నుంచి వెయ్యి రుపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. 2019లో రూ. 16-18వేల కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు రూ.32వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోందని ఆమె పేర్కొన్నారు.
మద్యం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉందని, ఏపీబెవరేజీస్ కార్పొరేషన్ ప్రత్యేక పన్నులు వసూలు చేసి, వాటిని చూపించి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని ఆమె చెప్పారు. బేవరేజీస్ కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారని, సంక్షేమ విడతలో భాగంగా అమ్మఒడి, ఆసరా, చేయూత కార్యక్రమాలకు అవసరమైన నిధుల్ని బేవరేజీస్ కార్పోరేషన్ ద్వారా ఇవ్వాలని చెబుతున్నారని ఆమె ఆరోపించారు. కుటుంబాలు చిద్రమై, మహిళల పుస్తెలు తెగినా, కుటుంబాలు నాశనమై పోయినా శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని పురందేశ్వరి మండిపడ్డారు.
చీప్ లిక్కర్ తయారీ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆమె తెలిపారు. ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మద్యం దుకాణాలు, ఆస్పత్రుల్ని పరిశీలిస్తే తేలుస్తుందని, గుండె జబ్బులు, లివర్ సిరోసిస్, అనారోగ్యంతో ఎంతో మంది చనిపోతున్నారని ఆమె చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వం చేసే హత్యలేనని ఆమె స్పష్టం చేశారు. చీప్ లిక్కర్ తాగడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పురందేశ్వరి ఆరోపించారు.
More Stories
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్