
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో కూడా పాల్గొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీఎం జగన్ టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1.25 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.
డైరీలు, క్యాలెండర్లు సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు సందర్భంగా మాఢ వీధుల్లో గరుడ ధ్వజపటం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. మీనలగ్నంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేశారు.
తిరుపతిలో పలు అభివృద్ధి పథకాలను ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించారు. రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను తిరుపతి ప్రజలకు అంకితమిచ్చారు. 3518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మరో మూడు వేల మందికి త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.
అనంతరం సీఎం జగన్ తిరుపతి గంగమ్మ దేవతను దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలను ప్రారంభించారు.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు