`ఇండియా’ కూటమికి దూరం కానున్న సిపిఎం

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కాంగ్రెస్ సారధ్యంలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమి `ఇండియా’ నుండి అప్పుడే ఓ కీలక పక్షం  బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ `కూటమి’  ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పార్టీలలో  ఒకటైన సిపిఎం కూటమిలో కొనసాగడం ఆత్మహత్య సాదృశ్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో చేతులు కలపడం రాజకీయంగా పెనుముప్పుగా  మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవంక, పశ్చిమ బెంగాల్ లో సీపీఎం నేతలు కాంగ్రెస్ తో చేతులు కలపడానికి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2004లో కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటులో సిపిఎం కీలకంగా వ్యవహరించినా, వామపక్షాల మద్దతుతో ఆ ప్రభుత్వం ఏర్పడినా వామపక్షాలు బయట నుండి మద్దతు ఇచ్చాయి గాని, యూపీఏలో భాగస్వామ్యం కాదని ఈ సందర్భంగా బెంగాల్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్  ప్రభుత్వాల ఏర్పాటులో సిపిఎం, ఇతర వామపక్షాలు కీలక పాత్ర వహించినా, ఆయా కూటమిలో భాగస్వామ్యం కాలేదు. కేవలం బయటి నుండి మాత్రమే మద్దతు అందించాయి. వి పి సింగ్ ప్రభుత్వంకు ఒక వైపు బిజెపి, మరోవైపు వామపక్షాలు మద్దతు ఇవ్వడం గమనార్హం.

అయితే, ఇప్పుడు ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఎం భాగస్వామ్యం కావడం ఆయా పార్టీ వర్గాలలోని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అయితే అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షాలో ఉన్న సిపిఎం, కాంగ్రెస్ లకు అగ్గిరాజు కొంటున్నది.  అయితే జాతీయ స్థాయిలో ఆయా పార్టీల నాయకులు ఒకటిగా ఉండటం ఆ పార్టీ స్థానిక నేతలు సహించలేకపోతున్నారు.

బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థులని, ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఢిల్లీలో వారాంతం జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు జాతీయ మీడియాలో కధనాలు వెలువడ్డాయి. 

మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే సమన్వయ సమావేశాలకు ప్రతినిధులు ఎవర్నినీ పంపించకూడదని కూడా సీపీఎం నిర్ణయించినట్టు పలు కధనాలు పేర్కొంటున్నాయి. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.