
కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. కొత్త పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్’గా నామకరణం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్ల అమలు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల్లోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. లోక్‌సభతో 181 సీట్లను మహళలకు ప్రత్యేకిస్తారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతూ, మహిళా సాధికారతకు ఈ బిల్లు ఉద్దేశించినదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఎఎ ను సవరించడం ద్వారా ఢిల్లీ నేషనల్ టెరిటరీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు. ఈ బిల్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మహిళలకు విస్తృత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టగానే రిజర్వేషన్ అమల్లోకి వస్తుందని, ఇది 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించాయిరు. ప్రతి డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ తర్వాత మహిళలకు రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని చెప్పారు.
బిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడవ వంత సీట్లను రిజర్వ్ చేశారు. ఒక సీటు కోసం ఇద్దరు మహిళా ఎంపీలు పోటీపడకూడదు. ఓబీసీ క్యాటగిరీలో మహిళలకు రిజర్వేషన్ లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత రిజర్వేషన్లు కేటాయించనున్నారు.
లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వ్డ్ సీట్లకు రొటేషన్ పద్ధతి కల్పించారు. విధాన రూపకల్పనలో మహిళల పాత్రను పెంచేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. 2029 నాటకి మహిళా రిజర్వేషన్ బిల్లు అములోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల అనంతరం, అంటే 2027లో నియోజకవర్గాల పునర్ విభజన ఉంటుంది.
2021 జరగాల్సిన జనాభా లెక్కలను కోవిడ్ వల్ల పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. చట్టంగా మారిన తర్వాత ఆ బిల్లు సుమారు 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. ఆ టర్మ్‌ను కావాలంటే కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రతిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత.. మహిళలకు కేటాయించిన సీట్లను రొటేషన్ పద్ధతిలో మార్చుతారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టమని భావిస్తున్నానని చెప్పారు. మహిళా శక్తికి ద్వారాలు తెరిచే అవకాశం ఈ కొత్త భవనంలో లభించిందని పేర్కొన్నారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధి జరగాలనే తమ భావనకు తొలి అడుగుగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్నామని తెలిపారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు