పాత పార్లమెంట్ భవనం ఇక `సంవిధాన్ సదన్’

కొత్త పార్ల‌మెంట్ భవనంలోకి ప్ర‌వేశిస్తున్న నేప‌థ్యంలో ఇక నుండి పాత పార్ల‌మెంట్ బిల్డింగ్‌ను సంవిధాన్ స‌ద‌న్‌ గా పిలుచుకుందామ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కొత్త భవనంలోకి వెళ్లినంత మాత్రాన‌ పాత పార్ల‌మెంట్ భవనంహుందాత‌నం ఏమాత్రం త‌గ్గిపోవ‌ద్దని స్పష్టం చేశారు. పార్లమెంటు కొత్త భవనంలోకి అడుగుపెట్టడానికి సెంట్రల్ హాలులో మంగళవారం ఎంపీలంతా సమావేశమయ్యాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
దేశాన్ని ఆత్మ నిర్భ‌రంగా మార్చ‌డమే బాధ్య‌త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు.  భ‌విష్య‌త్తు కోసం స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చెబుతూ కేవ‌లం రాజ‌కీయ లాభాల గురించి ఆలోచించ‌వ‌ద్దని, జ్ఞానం-ఆవిష్క‌ర‌ణ‌ల‌పై దృష్టి సారించాలని ప్రధాని కోరారు.  కొత్త పార్లమెంటు భవనంలో కొత్త భవిష్యత్తును ఈరోజు మనం ప్రారంభించనున్నామని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో కొత్త భవంతిలోకి అడుగుపెడుతున్నామని ప్రధానమంత్రి తెలిపారు. 
గత 71 సంవత్సరాల్లో పలు ప్రభుత్వాలు అనేక కీలక నిర్ణయాలను ఇక్కడే తీసుకున్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్లమెంటు సభ్యులకు, దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో 1952 నుంచి 41 మంది ప్రభుత్వాధినేతలు ప్రసంగించారని, 86 సార్లు రాష్ట్రపతుల ప్రసంగాలు జరిగాయని, సుమారు 4,000 చట్టాలు ఇక్కడే చేశారని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్, ట్రాన్స్‌జెండర్స్‌ చట్టాలు ఈ పార్లమెంటులోనే ఆమోదం పొందాయని గుర్తుచేశారు. 
 
370వ అధికరణ రద్దు ఇక్కడే చేటుచేసుకుందని తెలిపారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తోందని చెబుతూ భారతదేశ అభివృద్ధి లక్ష్యంగా, ఆ లక్ష్య సాధన దిశగా దృఢ సంకల్పంతో కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్తున్నామని తెలిపారు. ఇండియా నూతన శక్తితో, నూతన సంకల్పంతో కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 
 
దేశ భవిష్యత్తు కోసం సకాలంలో సరైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుందని మోదీ చెప్పారు. నాలెడ్జ్, ఇన్నొవేషన్‌లపై మనమంతా దృష్టిసారించాలని చెప్పారు. చంద్రయాన్-3 విజయం తర్వాత యువత శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల మరింత మక్కువతో ఉన్నారని పేర్కొంటూ ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోరాదని ప్రధాని సూచించారు.