
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌గా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇప్పటికే పాత పార్లమెంటు భవనానికి సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో సభా కార్యకలాపాలు మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి. అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో కార్యక్రమం జరుగనుంది.
దాదాపు గంటన్నరపాటు జరుగనున్న ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ప్రారంభమై జాతీయ గీతంతోనే ముగుస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగతం పలుకుతారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీనియర్ పార్లమెంటేరియన్లు అయిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ, జేఎంఎం లీడర్ శిబు సోరెన్ కూడా మాట్లాడనున్నారు.
సెంట్రల్ హాల్ కార్యక్రమానికి ముందు ఎంపీలంతా కలిసి ఫొటో దిగారు. పాత పార్లమెంటు భవనం లోపలి ప్రాంగణంలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు వేర్వేరుగా, అంతా కలిసి మరో ఫొటో తీసుకున్నారు. ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది.
96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగిసిపోయింది. సోమవారం నాటి సమావేశంతో పాత పార్లమెంటు భవనానికి సభ్యులు వీడ్కోలు పలికారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. లోక్‌సభ చాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ చాంబర్‌లో 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు లోక్‌సభ చాంబర్‌లో 1280 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.
ఇకపై పూర్తిగా పేపర్‌లెస్‌గా కార్యకలాలు కొనసాగనున్నాయి. ప్రతి సభ్యునికి ట్యాబ్ ఇవ్వనున్నారు. అందులోనే సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇక ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించిన మైక్రోఫోన్‌లకు ఒక ప్రత్యేక సిస్టమ్ ఉంది. ఎంపీలకు ప్రసంగం కోసం కేటాయించిన నిర్ణీత సమయం ముగిసిన వెంటనే వారి మైక్రోఫోన్స్ బంద్ కానున్నాయి.
ఇక సమావేశాల సందర్భంగా సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసనలు తెలుపడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త భవనంలో అలాంటి వాటికి వీలులేదు. పార్లమెంట్‌కు ఆరు ద్వారాలు ఉన్నాయి. వాటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అని నామకరణం చేయడం విశేషం. మంగళవారం ఉదయం గణపతి పూజతో కొత్త పార్లమెంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు
కాంగ్రెస్ ను నడిపిస్తున్న `అర్బన్ నక్సల్స్’