ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్​ హస్తం.. కెనడా ప్రధాని!

* భారత ఇంటెలిజెన్స్​ చీఫ్ బహిష్కరణ 
కెనడాలో చెలరేగుతున్న ఖలిస్థాన్  వాదుల కార్యకలాపాలు తరచూ హింసాయుత చర్యలకు కూడా దారితీస్తుండడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే అటువంటి చర్యల పట్ల కెనడా ప్రభుత్వం పట్టి పట్టన్నట్లు వ్యవహరిస్తుండటంతో రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా, భారత ప్రభుత్వంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది, టైగర్​ ఫోర్స్​ చీఫ్​ హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ హత్య వెనుక భారత్​ హస్తం ఉందని వ్యాఖ్యానించారు.  భారత ప్రభుత్వంపై జస్టిన్​ ట్రూడో సంచలన ఆరోపణలు చేసిన కొంతసేపటికి ఒటావాలోని భారత ఇంటెలిజెన్స్​ చీఫ్​ను కెనడా బహిష్కరించింది.

“కెనడాలోని భారతీయ సీనియర్​ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నాము,” అని ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన రా (రీసెర్చ్​ అండ్​ ఎనాలసిస్​ వింగ్​) చీఫ్​ అని పేర్కొంది. తమ దేశం కేంద్రంగా చెలరేగుతున్న ఖలిస్థానీ ఉగ్రవాద సమస్యను కెనడా పరిష్కరించట్లేదని భారత్​ అంసతృప్తిగా ఉంది.

కెనడా ప్రధాని ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తాని తీవ్రవాదుల నుండి ప్రపంచం దృష్టి మళ్లించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడింది. అటువంటి శక్తులకు కెనడా ఆశ్రయం ఇవ్వడం భారత దేశం సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ- జస్టిన్​ ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై మోదీ కాస్త గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయమై  కెనడాలో భారత్​కు చెందిన సీనియర్​​ దౌత్యవేత్తను అక్కడి ప్రభుత్వం బహిష్కరించడంతోఇప్పటికే బలహీనంగా ఉన్న భారత్​- కెనడా బంధం మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

పంజాబ్​ జలంధర్​లోని భార్​సింఘ్​పూర్​లో జన్మించాడు నిజ్జార్​. అతడిని ఎన్​ఏఏ (నేషనల్​ ఇన్​వెస్టిగేషన్​ ఏజెన్సీ) పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించింది. గతేడాది జులైలో నిజ్జార్​పై రూ. 10 లక్షల నగదు​ రివార్డ్​ను కూడా ప్రకటించింది. కాగా  కెనడా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారాలో జూన్​ 18న కొందరు దుండగులు హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ను చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ విషయంపై తాజాగా కెనడా ప్రధాని భారత్ పై ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. “ఈ విషయంపై కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్నాము. హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందనేందుకు కెనడా భద్రతా దళాల వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్టు కనిపిస్తోంది” అంటూ ఆరోపించారు.  పైగా, “ఇతర దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ విషయంపై మా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నాము. ఇది చాలా తీవ్రమైన అంశం. మేము చాలా సీరియస్​గా పరిగణిస్తున్నాము,” అని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో వెల్లడించారు.

ఈ విషయంపై తమకు సహకరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ట్రూడో. ఈ పరిస్థితులతో ఇండో- కెనడియన్లు భయపడాల్సి అవసరం లేదని, ఎప్పటిలాగే అందరు కలిసి మెలిసి ఉండొచ్చని ట్రూడో హామీనిచ్చారు.