జాహ్నవి కందుల మృతిపై నగర మేయర్‌ క్షమాపణలు

భారతీయ విద్యార్థి జాహ్నవి కందుల అమెరికాలో మృతి చెందటంపై సీటెల్‌ నగర మేయర్‌ బ్రూస్‌ హారెల్‌ క్షమాపణలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరి 23న సీటెల్‌లో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి  గురించి సీటెల్‌ పోలీస్‌ అధికారి డానియల్‌ ఆర్థర్‌ చులకనగా మాట్లాడిన ఘటన ఈ నెల 14న వెలుగులోకి వచ్చింది. 

ఈ వ్యాఖ్యలపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా జాహ్నవి మరణంపై  సీటెల్  నగర మేయర్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ అధికారి డానియల్‌ ఆర్థర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన భారత సమాజానికి క్షమాపణ చెప్పారు. ఈ దురదృష్ట  సంఘటన, అనుచిత వ్యాఖ్యలతో భారత సమాజం ఏకమైందని, నగర అధికారులు భారత కమ్యూనిటీకి, జాహ్నవి మరణానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని బ్రూస్‌ హారెల్‌ తెలిపారు. సీటెల్‌ పోలీస్‌ చీఫ్‌ ఆడ్రియన్‌ డియాజ్‌ కూడా జాహ్నవి మృతికి సంతాపం తెలిపారు. 

ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన 20 మంది ప్రముఖులతో సీటెల్‌ మేయర్‌, పోలీస్‌ చీఫ్‌ సమావేశమయ్యారు. పొరుగువారిని రక్షించే, గౌరవించే సీటెల్‌ నగరాన్ని రూపొందిస్తామని వారు హామీ ఇచ్చారు. జాహ్నవి కందుల మరణంపై త్వరితగతిన న్యాయవిచారణ జరిపిస్తామని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హామీ ఇచ్చింది.

మరోవంక, కందుల జాహ్నవికి న్యాయం చేయాలని ఆందోళనలు అమెరికాలో  ఉధృతమవుతున్నాయి. ఆమె మృతి గురించి చులకనగా మాట్లాడిన సీటెల్‌ పోలీస్‌ అధికారి డానియల్‌ ఆర్థర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆన్‌లైన్‌ పిటీషన్‌ ప్రారంభమయింది. వేలాది మంది పిటీషన్‌పై సంతకం చేశారు.  ఆర్థర్‌ను విధుల నుంచి తొలగించాలని, ఆయన చర్యలు ప్రజాభద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేవని పిటీషన్‌దారులు తెలిపారు. ఆర్థర్‌పై చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే పోలీస్‌ వ్యవస్థపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించగలరని ఉన్నతాధికారులకు పిటిషన్‌దారులు విజ్ఞప్తి చేశారు.
 
జాహ్నవి మృతిపై పోలీస్‌ అధికారి డానియల్‌ ఆర్థర్‌ చులకనగా మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సీటెల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గిల్డ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో వినిపిస్తున్న ఆర్థర్‌ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని తెలిపింది. ఆర్థర్‌ వ్యాఖ్యలకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోలో సంభాషణలు పూర్తిగా లేవని చెప్పింది.