అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన విమానం

బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్‌ అడవులలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కుప్పకూలింది. దీంతో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు పైలెట్లు కూడా ఉన్నారు. 
 
12 మంది ప్రయాణికులు ఫిషింగ్‌ స్పోర్ట్‌ కోసం మానౌస్‌ నుంచి బార్సిలోస్‌కు  ఈఎంబీ-110 అనే చిన్న విమానంలో వెళ్తున్నారు. అయితే వర్షం కారణంగా విమానాన్ని దించడానికి పైలట్లు ప్రయత్నించారు. దీంతో అది ప్రమాద వషాత్తు కూలిపోయిందని అమెజానాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్ లిమా సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో తెలిపారు.
 
‘బార్సెలోస్’లో ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్‌ ప్రయత్నించిన ఓ చిన్న విమానం కుప్పకూలింది. ప్రమాదానికి గురైన విమానం భారీ వర్షం మధ్య బార్సిలోస్ పట్టణం చేరుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా సరిగా కనిపించే పరిస్థితి లేకపోవడంతో పైలెట్ విమానం ల్యాండింగ్‌ను రన్‌వే మధ్యలో మొదలుపెట్టడం ఈ దుర్ఘటనకు దారితీసిందని అమెజాన్ స్టేట్ సెక్యూరిటీ సెక్రటరీ వినిసస్ అల్మేడియా తెలిపారు. 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విమానంలోని ప్రయాణికులంతా బ్రెజిల్‌ పౌరులేనని తెలుస్తోంది. అందరూ పురుషులేనని, వారంతా స్పోర్ట్ ఫిషింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చారని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. విమానం కుప్పకూలిన మరుక్షణం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అక్కడి గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్ వెల్లడించారు.