మరోసారి అత్యంత ప్రజాదరణ గల నేతగా మోదీ

ప్రపంచంలో అత్యంత ఆమోదనీయుడైన నాయకుల్లో తొలి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. ప్రపంచ నాయకుల ఆమోదనీయతపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే కన్సల్టెన్సీ సంస్థ ఈ ‘’ప్రపంచ ఆమోదయోగ్య రేటింగ్ ట్రాకర్” సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 12 మధ్య డేటాను సేకరించి ఫలితాలను ప్రకటించింది.
 
22 దేశాల సీనియర్ నేతలను వెనక్కి నెట్టి ఈసారి కూడా మళ్లీ భారత ప్రధాని మోదీ  అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అత్యధిక ప్రజలు నాయకుడిగా అంగీకరించిన ప్రపంచ నేతగా మోదీ మరోసారి నిలిచారు. గతంలో కూడా ఈ తరహా సర్వేలో ప్రధాని మోదీ తొలి స్థానంలో నిలిచారు.  తాజా సర్వేలో మోదీకి 76% ప్రజలు అత్యంత ఆమోదనీయుడైన నాయకుడిగా తొలి స్థానం ఇచ్చారు.
సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10 తేదీల్లో జీ 20 సమావేశాలను ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో మోదీకి ఈ రికార్డు లభించింది.  మోదీ నాయకత్వాన్ని 76% మంది ఆమోదించగా, 18% మంది వ్యతిరేకించారు. 6% ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఈ సర్వేలో మోదీ తరువాత రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ నిలిచారు. తనకు 64% ఆమోదనీయత లభించింది.
ఆ తర్వాత మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ఉన్నారు. లోపెజ్ కు 61% రేటింగ్ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా 49 శాతం ఆమోదం రేటింగ్ తో నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక ఐదవ స్థానంలో అల్బనీస్ 48 శాతం ఆమోదం రేటింగ్ తో ఉన్నారు. మెలోని 42 శాతం ఆమోదం రేటింగ్ తో ఆరవ స్థానంలో ఉన్నారు. 40 శాతం రేటింగ్ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడవ స్థానంలో ఉన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు 37%, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు 27%, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కు 24% రేటింగ్స్ మాత్రమే లభించాయి.
 
సెప్టెంబర్ 6నుంచి సెప్టెంబర్ 12 మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలను ప్రకటించామని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఆయా దేశాల్లోని పౌరుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించామని వెల్లడించింది. వివిధ దేశాల్లో, వయోజనుల్లోని వివిధ ఏజ్ గ్రూప్ లకు సంబంధించిన వేర్వేరు సాంపిల్ సైజ్ లను సర్వే చేశామని తెలిపింది. అమెరికాలో సాంపిల్ సైజ్ 45 వేలు అని వివరించింది. రోజుకు కనీసం 20 వేల సాంపిల్స్ ను ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేశామని వెల్లడించింది.