`పవర్ షేరింగ్’తోనే అసెంబ్లీలో అడుగుపెడతాం

వచ్చే ఎన్నికల్లో టిడిపిలో పొత్తుకు సిద్ధమని రాజమండ్రి సెంట్రల్ జైలు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పరామర్శించిన అనంతరం అకస్మాత్తుగా ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా వచ్చే ఎన్నికలలో `అధికార భాగస్వామ్యం’ (పవర్ షేరింగ్)తోనే అసెంబ్లీలో అడుగు పెడతామని వెల్లడించారు. తద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిని సహితం అధికారంలోకి వస్తే రెండు పార్టీలు పంచుకోవాల్సి ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
 
బీజేపీతో పొత్తులో ఉన్నా కొన్ని కారణాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ, జనసేన బలంగా పనిచేసి ఉంటే జగన్ ఇలా ఉండేవారు కాదని పవన్ తెలిపారు. అయితే,  జనసేన ఎన్డీఏలోనే ఉంటుందని, బయటకు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
2024లో జనసేన బలమైన స్థానంలో ఉంటుందని, పవర్ షేరింగ్ ద్వారా అసెంబ్లీలో జనసేన అడుగుపెడుతోందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు ఏపీ దిశ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోనూ జనసేన ఉంటుందని చెప్పారు. ముందు జగన్ ను ఏపీ నుంచి తరిమేయాలని పిలుపిచ్చారు. 
 
టీడీపీ, జనసేన మధ్య పొత్తు సమన్వయం చేసేందుకు కమిటీకి జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించారు. మరో 6 నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని పవన్ జోస్యం చెప్పారు.
 

తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే అని పేర్కొంటూ ఈ ఉద్దేశంతోనే టీడీపీ- జనసేన పొత్తు ప్రకటన చేశానని తెలిపారు. గతంలో టీఆర్ఎస్ తమను మద్దతు కోరిందని పవన్ తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఒక్కరోజులో బలంగా తయారవ్వదన్న ఆయన జగన్ ను తక్కువ అంచనా వేయనని చెప్పారు. ఆయన బలం ఆయనకు ఉంటే, తమ బలం తమకు ఉందని గుర్తు చేశారు. 

వైసీపీ ఓ చీడ, పీడ అని విమర్శించిన పవన్దాని నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని పరోక్షంగా ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ ఎన్ని సమస్యలు ఎదురైనా పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.
త్వరలో దిల్లీ వెళ్తాను. ఏపీ పరిస్థితులను అమిత్ షా, జెపి నడ్డాలకు వివరిస్తానని తెలిపారు. ఏపీలో అక్రమ అరెస్టులను, టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దలకు వివరిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెబుతూ సొంత రాష్ట్రానికి రాకుండా తనను అడ్డుకున్నారని అంటూ వైసిపి ప్రభుత్వంపై పవన్‌ మండిపడ్డారు.