భారత్‌- కెనడా వాణిజ్య చర్చలకు ఖలిస్థానీ చిచ్చు

ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జీ 20 సదస్సు తర్వాత ఇవి మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు అంతరాయం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునః ప్రారంభిస్తామని భారత్ స్పష్టంగా చెప్పింది. 

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఓ మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వాస్తవానికి జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందే భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కెనడా ప్రకటించింది. వచ్చే నెలలో ఆ చర్చలను తిరిగి ప్రారంభించాల్సి ఉండగా ఇప్పుడు మరోసారి వాటికి అంతరాయం ఏర్పడింది. 

అటు కెనడా కూడా ఈ చర్చలపై స్పందించింది. భారత్‌లో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆ దేశ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారు. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం కెనడా వెల్లడించలేదు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.

కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ  ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని , అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

ఖలిస్తాన్‌ మద్దతుదారుల దాడులపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ హింస నిరోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే శాంతియుత నిరసన స్వేచ్ఛను కెనడా ఎల్లప్పుడూ కాపాడుతుందని స్పష్టం చేయడం ద్వారా వారి పట్ల కఠినంగా వ్యవహరింపబోమనే సంకేతాన్ని ఇచ్చారు. కెనడాలో గణనీయంగా ఉన్న పంజాబీయుల ఓట్లకోసం ఆయన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

 దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. భారత్, కెనడా మధ్య ఇప్పటివరకు ఆరు సార్లు వాణిజ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య అత్యధిక వస్తువులపై కస్టమ్స్ సుంకాన్నితొలగించడం లేదా తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించేలా వాణిజ్య నిబంధనలను సరళీకరించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశం. 

ఈ ఒప్పందంతో టెక్స్‌టైల్, లెదర్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తొలగించుకోవడంతోపాటు వీసా నిబంధనలను కూడా సులభతరం చేసుకోవచ్చని భారత్ భావిస్తోంది. అటు భారత్ నుంచి డెయిరీ , వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చని కెనడా ఈ చర్చలు ప్రారంభించింది.

సిక్కు విద్యార్థిపై దాడిని ఖండించిన భారత్

ఇలా ఉండగా, కెనడాలో సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. బస్సు దిగి వెళ్లిపోతున్న 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై మరో టీనేజర్ పెప్పర్ స్ప్రేను చల్లాడు. ఐదు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని వార్తా కథనాలు వెల్లడించాయి. 

ఈ సంఘటనకు ముందు బాధితుడు, ఇతర విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనిపై దౌత్యకార్యాలయం స్పందిస్తూ ఘటనపై దర్యాప్తు జరిపి , కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఈ ఘటనపై కెలౌనా సిటీ కౌన్సిలర్ మోహినీ సింగ్ మీడియాతో మాట్లాడారు.

‘చదువు పరంగా ఆ పిల్లాడు చురుగ్గా ఉంటాడు. ప్రస్తుతం అతడు షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇండోకెనడియన్ కమ్యూనిటీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఈ తరహాలో జరిగిన రెండో సంఘటన ఇది. మార్చి నెలలో భారత సిక్కు విద్యార్థి గగన్‌దీప్ సింగ్ దాడికి గురయ్యాడు.