రుణాలు చెల్లించినా ఆస్తి పత్రాలు ఇవ్వకపోతే బాంకులకు జరిమానా

రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్‌లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆదేశాలు జారీచేసింది. రుణగ్రస్తుడు రుణాన్ని పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు గతంలో తనఖాగా ఉంచిన ఒరిజినల్‌ చర, స్థిరాస్తి పత్రాల్ని తిరిగి ఇవ్వాలని పేర్కొంది. 

ఈ ఆదేశాల్ని పాటించకపోతే రెగ్యులేటెడ్‌ ఎంటిటీస్‌ (ఆర్‌ఈలు, ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు) రుణగ్రహీతకు రోజుకు రూ. 5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చర, స్థిరాస్తి పత్రాల్ని విడుదలలో ఆర్‌ఈలు విభిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నందున, ఖాతాదారులతో వివాదాలు తలెత్తుతున్నాయని గుర్తించినట్టు ఆర్బీఐ తెలిపింది. 

ఆస్తి పత్రాల్ని విడుదల చేయడంలో జాప్యం జరిగితే అందుకు కారణమేమిటీ రుణగ్రహీతకు ఆర్‌ఈలు తెలియపర్చాలని కేంద్ర బ్యాంక్‌ సూచించింది. ఒరిజినల్‌ చర, స్థిరాస్తి డాక్యుమెంట్లను రుణ ఖాతాను నిర్వహించిన బ్యాంకింగ్‌ శాఖ లేదా ఆర్‌ఈలకు చెందిన ఏ ఇతర కార్యాలయంలోనైనా తీసుకునే ఆప్షన్‌ను ఖాతాదారుకు ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. 

రుణగ్రహీత/ఉమ్మడి రుణగ్రహీతలు మరణించినట్లయితే ఒరిజినల్‌ పత్రాల్ని చట్టబద్దమైన వారసులకు తిరిగి ఇచ్చే ప్రొసీజర్‌ను రూపొందించుకోవాలని ఆర్‌ఈలకు సూచించింది. ఖాతాదారుల సమాచారం కోసం ఆ ప్రొసీజర్‌ను ఆర్‌ఈలు వాటి వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నది. ఒరిజినల్‌ చర, స్థిరాస్తి పత్రాలు పోయి నా, పాడైనా, వాటి డూప్లికేట్‌/సర్టిఫైడ్‌ కాపీలను రుణగ్రహీత పొందడంలో ఆర్‌ఈలు సహాయంగా ఉండాలని, అందుకు అయ్యే వ్యయాల్ని ఆర్‌ఈలు భరించడంతో పాటు అదనపు పరిహారం చెల్లించాలని ఆర్బీఐ ఆదేశించింది. 

అటువంటి సందర్భాల్లో ఈ ప్రొసీజర్‌ పూర్తిచేయడానికి మరో 30 రోజుల గడువు ఆర్‌ఈలకు ఇస్తున్నట్టు తెలిపింది. జాప్యం జరిగిన సమయానికి పెనాల్టీ ఈ సందర్భంలో 60 రోజులు దాటిన తర్వాత వర్తిస్తుందని పేర్కొంది. ఒరిజినల్‌ చర/స్థిరాస్తి డాక్యుమెంట్ల రిలీజ్‌కు సంబంధించిన అన్ని కేసులకు ఈ ఆదేశాలు 2023 డిసెంబర్‌ 1నుంచి వర్తిస్తాయని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్‌లో వివరించింది.