తిరుమల నడకమార్గాలను సురక్షిత జోన్లుగా మార్చే యత్నం

యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, తిరుమల నడకమార్గాల్లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ వార్డెన్‌ మధుసూధన్‌ రెడ్డి వెల్లడించారు. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను సురక్షిత జోన్లుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ లక్ష్యమని తెలిపారు.

యాత్రికులకు జంతువులు తారసపడకుండా చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తరువాత తిరుమల కాలిబాట మార్గాలు, ఘాట్‌ రోడ్లలో భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్టు తెలిపారు.

ఏడో మైలు నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 20 రియల్‌ టైమ్‌ హై-ఫై కెమెరాలు, మరో 300 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. మరో 500 అధునాతన సిమ్ బేస్డ్ రియల్ టైమ్ కెమెరా ట్రాప్ లను కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఇలా ఉండగా, గత రెండు మాసాల్లో అలిపిరి కాలిబాట మార్గంలో రెండు దురదృష్టకర ఘటనలు జరగడంతో అ లిపిరి నడకమార్గంలో నిఘా పెంచామని తెలిపారు.  ట్రాప్ కెమెరాల ద్వారా నడక మార్గంలో చిరుత, ఎలుగు బంటిలు సంచరించడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఐదు చిరుతలను బంధించామని, ఇంకా ఐదు చిరుతలు సంచరిస్తునట్లు గుర్తించామని ఆయన చెప్పారు. కాలిబాట మార్గంలో ఇరువైపులా 20 మీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని చదును చేశామని తెలిపారు. తద్వారా జంతువుల సంచారాన్ని భక్తులు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవుతారని ఆశాభావం వ్యక్తం చేసారు.

అలిపిరి నడకమార్గంలోని దుకాణాల్లో ఆహార వ్యర్థాలను పడేస్తుండడం వల్ల, వీటి కోసం జింకలు, అడవిపందులు, కుక్కలు వంటి జంతువులు వస్తున్నాయని చెప్పారు. ఈ జంతువుల కోసం చిరుతలు, ఎలుగుబంట్లు ఇటువైపు వస్తున్నాయని, ఈ కారణంగా ఆహారపదార్థాలు విక్రయించే దుకాణాలపై ఆంక్షలు విధించామని తెలిపారు.

నడకమార్గాల్లో సాధారణ స్థితి నెలకొనే వరకు సెక్యూరిటీ గార్డు తోడుగా 100 మంది భక్తులను గుంపులుగా పంపడం, 12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతించడం, ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాలు అనుమతించడం వంటి చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

దీర్ఘకాలిక చర్యగా ఎత్తయిన నడకమార్గాలనే సూచించారు. శేషాచల కొండలు అరుదైన వృక్షజాలం, జంతుజాలంతో గొప్ప ప్రకృతి సౌందర్యాల నిధిగా ఉన్నాయని పేర్కొన్నారు. నూతన నడక మార్గాల్లో యాత్రికులు ప్రకృతి అందాలను వీక్షించి గొప్ప అనుభూతిని పొందుతారని, వన్యప్రాణులు హాయిగా సంచరిస్తాయని ఆయన చెప్పారు.