చైనాలో మొన్న విదేశాంగ మంత్రి … నేడు రక్షణ మంత్రి అదృశ్యం!

పొరుగు దేశమైనా చైనాలో ఒకరి తర్వాత ఒకరుగా కీలక మంత్రులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.  మూడు నెలలుగా చైనా విదేశాంగ మంత్రి చిన్ గాంగ్ కనిపించడం లేదు. ఆయన ఎమయ్యారో? ఎక్కడున్నారో? ఇప్పటికీ జాడ తెలియలేదు. ఇప్పుడు తాజాగా, గత రెండువారాలుగా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు కనిపించకుండా పోయారు.

చివరిసారిగా ఆయన ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా – ఆఫ్రికా ఫోరం సమావేశంలో ప్రసంగించారు. గత రెండు వారాలుగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో అదృశ్యం  అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.  జపాన్‌లోని అమెరికా రాయబారి రహ్మ్‌ ఇమాన్యుయేల్‌ గత శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా చైనా రక్షణ మంత్రి ఆచూకీ తెలియడం లేదని ట్వీట్‌ చేశారు. చైనాలో ఇది రెండో హై ప్రొఫైల్‌ మిస్సింగ్‌ అన్నారు.

లీ షాంగ్‌ఫు ఈ ఏడాది మేలో రక్షణ మంత్రిగా నియామకమయ్యారు.  గతేడాది అక్టోబర్‌లో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌లో సెంటర్‌ మిలటరీ కమిషన్‌ నుంచి వైదొలిగిన వీ ఫెంఘే స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన మిగతా రక్షణ మంత్రుల మాదిరిగా కాకుండా సైన్యం నుంచి మంత్రిగా నియామకమయ్యారు. 

ఆయన తండ్రి లీషావోజు 1930-40లలో జపనీస్‌ వ్యతిరేక ఉద్యమంలో పోరాడిన రెడ్‌ ఆర్మీలో సభ్యుడు. అంతర్యుద్ధం, కొరియా యుద్ధం సమయంలో లాజిస్టికల్ రైల్వేలను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. లీ షాంగ్‌ఫు వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. 

ఆయన చైనా ఉపగ్రహ కార్యక్రమాల్లో పని చేశారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆధునికీకరణకు ప్రయత్నించారు. చైనా స్పేస్‌, సైబర్‌వార్‌ ఫేర్‌ సామర్థ్యాన్ని అభివృద్ధిని వేగవంతం చేయడంలో కృషి చేశారు. ఆయన ప్రజలతో పాటు మీడియాలో కనిపించకుండా దూరంగా జీవించిన వ్యక్తి. చైనా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సింగపూర్‌లో జరిగిన షాంగ్రిలా చర్చల్లో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా లీ షాంగ్‌ఫు అదృశ్యంపై హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం ప్రచురించింది. ఆయన చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌ చైనా-ఆఫ్రికా ఫోరంలో ప్రసంగించారని పేర్కొంది. ఆగస్టులో ఆరు రోజుల పర్యటనలో రష్యా, బెలారస్‌కు వెళ్లారని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధంలో మాస్‌కు చైనా మద్దతు తెలిపింది.  చైనా రక్షణ మంత్రి ఏమయ్యారు? ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి ? ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారా ? అనేది ఇంకా తెలియరావడం లేదు.

మరో వైపు, ఇంతకు ముందు చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గాంగ్‌ సైతం ఆచూకీ కనిపించకుండా పోయింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి అత్యంత సన్నిహితుడైన ఆయన కనిపించకుండా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.  హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టుతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉండం వల్ల చైనా ఆర్మీ అదుపులోకి తీసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇలా ఉండగా, పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కమాండర్ల జాడ లేదు. ఈ రాకెట్ ఫోర్స్‌ అణు, బాలిస్టిక్‌ క్షిపణుల ఆయుధాగారాన్ని పర్యవేక్షిస్తుంది. చైనా ప్రభుత్వం తనను ధిక్కరించిన వారిని కఠినంగా అణివేస్తుందనడానికి అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా అదృశ్యమే ఒక ఉదాహరణ. ఆయన కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు.

 అటు, చైనా సైన్యం కూడా ఈ ఏడాది జులైలో ఐదేళ్లకు పైగా హార్డ్‌వేర్ సేకరణకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ ప్రారంభించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌లు, ఆర్మీ యూనిట్‌లపై సమాచారాన్ని లీక్ చేయడం, కొన్ని కంపెనీలకు బిడ్‌లను పొందడంలో సహాయపడటం వంటి ఎనిమిది అంశాలపై దర్యాప్తు చేపట్టింది.

అక్టోబర్ 2017 నాటి నుంచి కొనుగోళ్లను పరిశోధిస్తున్నట్లు సైన్యం తెలిపింది. కానీ, ఆ తేదీకి ప్రాధాన్యతను మాత్రం చెప్పడం లేదు. 2017 నుంచి 2022 వరకూ చైనా రక్షణ మంత్రిగా లీ ఈ విభాగానికి నాయకత్వం వహించారు. అయినప్పటికీ ఆయన తప్పు చేసినట్లు అనుమానించేలా ఎటువంటి సంకేతాలు లేవు.

ఇక, శుక్రవారం ఈశాన్య సరిహద్దుల్లో పర్యటించిన చైనా అధినేత జీ జిన్‌పింగ్ సైన్యంలో ఐక్యత, స్థిరత్వం గురించి నొక్కిచెప్పారు. రక్షణ మంత్రి అదృశ్యం వదంతుల వేళ ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పోరాట సంసిద్ధత స్థాయిని మెరుగుపరచడానికి, నూతన పోరాట సామర్థ్యాలను పెంపొందించే ప్రయత్నాలను కూడా చేయాలని చెప్పారు. ఆయన వెంటన చైనా అత్యున్నత సైనిక విభాగం వైస్ చైర్మన్ జాంగ్ యూక్సియా కూడా ఉన్నారు

అయితే, ఈ అదృశ్యాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా చైనా సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చించకుండా సెన్సార్ చేస్తూ ఆదేశాలిచ్చింది.