అసాధారణ సాహితీవేత్త దువ్వూరు రామిరెడ్డి

బి. సురేంద్రనాథ్ రెడ్డి,                                                                                                                    * 76వ వర్ధంతి సందర్భంగా నివాళి
కార్యదర్శి, “కవికోకిల” దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి, నెల్లూరు
విఖ్యాత తెలుగు కవి, రచయిత, నాటక కర్త, అనువాదకుడు, బహుభాషా కోవిదుడు దువ్వూరు రామిరెడి అసాధారణమైన తెలుగు సాహితీవేత్త.  ‘కవి కోకిల’ మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.
 
ఆయన కళాశాలలో చదువుకోలేదు. ప్రాచీన గ్రంధానాలను అవలోకనం చేసుకోలేదు. అయినా స్వతంత్రంకు ముందే ఎన్నో ప్రఖ్యాత గ్రంధాలను రచించారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలలో ఆరితేరిన వారుగా పేరొందారు.  కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో నవంబర్ 9, 1895న  జన్మించారు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశారు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడయ్యారు. నవంబర్ 11, 1947న కీర్తి శేషులయ్యారు.  1917లో, అంటే తన  22వ ఏటనే  సి.ఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో ఆయనకు స్వర్ణపతకం బహూకరించారు.
 
1918లో ఇతని కావ్యం “వనకుమారి”, విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్యస్పర్ధలో ప్రధమ స్థానం పొందింది.1929లో విజయవాడ ఆంధ్ర మహాసభ
 ద్వారా ‘కవికోకిల’ బిరుదును పొందారు. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన. దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. 
 
మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధులను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దువ్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకథోరణిని రేకెత్తించాయి.
 
తెలుగు సాహిత్యంలో “కర్షక కవి” గా, “సింహపురి సిరి” గా పేరుపొందిన ఆయన రైతుల జీవనశైలి నేపథ్యంతో “కృషీవలుడు” అనే ప్రఖ్యాత ఖండ కావ్యాన్ని రచించారు. ఆయన రాసిన యాత్రా రచన “హైదరాబాద్ పర్యటన,” భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో రచించిన “మాతృశతకం” చాలా ప్రసిద్ధిగాంచాయి. 
 
ఇంకా ఆయన చేసిన ప్రముఖ రచనలు “నలజారమ్మ” అనే కావ్యం, “రసిక జనానందం,” “కృష్ణరాయబారం,” అనే ప్రబంధాలు, “పానశాల,” “గులాబీతోట,” “పండ్లతోట” అనే అనువాదాలు, “మాధవ విజయం,” “కుంభరాణా,” “కర్షక విలాసం” అనే నాటకాలు. ఆయన తెలుగు సినీవినీలాకాశంలో సంభాషణ రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు.
 
స్వయంకృషితో అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన దువ్వూరి రామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో రచించిన ‘మాతృశతకం’లోని ప్రతి పద్యం అగ్నిశిఖను తలపించింది. బ్రిటీష్ వారు ఆ పుస్తక ముద్రణను అడ్డుకునేంతగా ప్రజలను ప్రభావితం చేసింది.
 
1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశారు. చిత్రనళీయం సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించారు. తరువాత తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం, పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశారు. చివరగా సీతారామ జననం సినిమాకు మాటలను సమకూర్చారు