ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించాల్సిందేనని జీ 20 కూటమి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక, రాజకీయ, వస్తుపరమైన సహాయం లభించకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మతపరంగా వ్యక్తులకు, చిహ్నాలకు, మతగ్రంథాలకు వ్యతిరేకంగా ఏ రకమైన విద్వేషాన్ని అయినా జీ 20 ఖండిస్తుందని ప్రకటించింది. 

మతపరమైన స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశం కావటం, సంఘాలు పెట్టుకునే హక్కు ఎంతో కీలకమైనవని, వాటిని బలోపేతం చేయటానికి కృషి చేస్తామని తెలిపింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తామని, అందరికీ విద్య లభించటానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

శిలాజ ఇంధనాలు, బొగ్గు వాడకాన్ని తగ్గించాలని చెబుతూనే ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేసింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో శనివారం ‘న్యూఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌’ పేరుతో ఒక ఉమ్మడి ప్రకటనను ఏకాభిప్రాయంతో ఆమోదించారు. 

ఉక్రెయిన్‌ సంక్షోభంపై జీ 20 సభ్యదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో, ఈసారి ఉమ్మడి ప్రకటన ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉక్రెయిన్‌ సంక్షోభం తాలూకు పేరాను మార్చిన తర్వాత డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. దీనిని భారత్‌ జీ 20 సారథ్యానికి దక్కిన విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

న్యూఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు

  • ‘అంతర్జాతీయ శాంతికి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా పరిణమించిన అంశాల్లో ఉగ్రవాదం ఒకటి. జాతి విద్వేషం, వర్గం, అసహనం.. ఇలా ఏ రూపంలో, ఏ పేరుతో ఉన్నా ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం. అన్ని మతాలు శాంతికి కట్టుబడి ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తిస్తూనే మతం పేరుతో, మత విశ్వాసాల పేరుతో ఉన్న ఉగ్రవాదాన్నీ ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా ఒక సమగ్రమైన వ్యూహంతో ఉగ్రవాదంపై గట్టి చర్యలు చేపట్టాలి. ఉగ్రవాదానికి ఆర్థిక, వస్తుపరమైన, రాజకీయ మద్దతు లేకుండా చూడాలి. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వరాదు.
  • మతపరంగా వ్యక్తులకు, చిహ్నలకు, మత గ్రంథాలకు వ్యతిరేకంగా ఏ రకమైన విద్వేషాన్ని అయినా జీ 20 వ్యతిరేకిస్తుంది. మతపరమైన స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశం కావటం, సంఘాలు పెట్టుకునే హక్కు పరస్పరం ఆధారపడిన అంశాలేకాకుండా, అవి పరస్పరం బలోపేతం చేసుకుంటాయి. మతం లేదా విశ్వాసాల ఆధారంగా ఉండే విద్వేషాన్ని, అసహనాన్ని ఎదుర్కోవటంలో ఈ హక్కులు కీలకమైన పాత్ర పోషిస్తాయి.
  • అవినీతిపై జీ 20 రాజీలేని వైఖరిని చూపుతుంది. దీనికోసం మూడు సూత్రాలను ఆమోదిస్తోంది. 1. అవినీతిపై పోరాటంలో భాగంగా దర్యాప్తు సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని, సమాచార మార్పిడిని బలోపేతం చేయాలి. 2. అక్రమాస్తుల స్వాధీన ప్రక్రియలను పటిష్ఠపరచాలి. 3. అవినీతిని నిరోధించే బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల, అధికారుల సామర్థ్యాన్ని, అంకితభావాన్ని పెంపొందించాలి. నేరస్థులు పోగు చేసుకున్న సంపదను స్వాధీనం చేసుకొని, సంబంధిత బాధితులకు, దేశాలకు ఆ సంపదను అప్పగించటానికి జరిగే ప్రయత్నాలకు జీ 20 మద్దతిస్తుంది.
  • వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో, లింగ సమానత్వం కేంద్రంగా వాతావరణ మార్పులపై జీ 20 కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యావరణ అంశాలపై జరిగే చర్చల్లో, కార్యాచరణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలకు జీ 20 దేశాలు మద్దతిస్తాయి. మహిళా సాధికారత కోసం జీ 20 ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.
  • శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించటానికి, పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని పెంచటానికి చర్యలు చేపడుతాం. వివిధ దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు వాడకాన్ని తగ్గించటం, శుద్ధ ఇంధనాల ఉత్పత్తిని పెంచటం, తక్కువ ఉద్గారాలను వెలువరించే ఇంధనాలను ప్రోత్సహించటం అవసరం. ఈ మేరకు అవసరమైన టెక్నాలజీలను, విధానాలను అభివృద్ధి పరచాలి. కరోనా అనంతరం దేశాల మధ్య నెలకొన్న అసమానతలను రూపుమాపటానికి సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలి. వాతావరణ, శుద్ధఇంధన లక్ష్యాలను చేరుకోవటానికి దేశాలకు భారీ ఎత్తున ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉంది.
  • ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎ్‌ఫ)కు, దానిలాంటి ప్రాంతీయ బోర్డులకు అవసరమైన వనరులను ఎప్పటికప్పుడు పెంచాలి. దీనికి జీ 20 కట్టుబడి ఉంది. ఇతరులు కూడా మద్దతిస్తారని ఆశిస్తున్నాం. అక్రమాస్తుల స్వాధీనానికి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేలా ఎఫ్‌ఏటీఎఫ్‌ చేస్తున్న కసరత్తును, ముఖ్యంగా, తన నిబంధనలను సవరించటాన్ని స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదులకు నిధుల సరఫరా, మనీ లాండరింగ్‌, ఆర్థిక సంక్షోభాలకు దారితీసే పరిస్థితులను నివారించటానికి, ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాలు సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు, తమ నిబంధనలు అంతర్జాతీయంగా అమలయ్యేలా ఎఫ్‌ఏటీఎఫ్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తున్నాం. లావాదేవీలకు సంబంధించి కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఆవిష్కరణలతో కలిగే ప్రమాదాలపై ఎఫ్‌ఏటీఎఫ్‌ కృషిని స్వాగతిస్తున్నాం.
  • సంక్షోభ పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారితో పాటు అందరికీ ఉన్నతస్థాయి విద్య, నైపుణ్యాలను అందించటానికి జీ 20 కట్టుబడి ఉంది. డిజిటల్‌ అంతరాలను తొలగించటానికి కూడా జీ 20 కృషి చేస్తుంది’ అని ‘న్యూఢిల్లీ లీడర్స్‌ డిక్లరేషన్‌’ ప్రకటించింది.