జి20 సదస్సు అట్టహాసంగా ప్రారంభం

భారత్‌ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా అట్టహాసంగా శనివారం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రపంచం మంచిగా ఉండాలంటే అందరు కలిసిగట్టుగా నడవాల్సిందేనని తెలిపారు. దిల్లీ ప్రగతి మైదాన్​లోని భారత మండపం వేదికగా మొదలైన రెండు రోజుల  సదస్సులో ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ  స్వయంగా స్వాగతం పలికారు.

“ప్రపంచంలో విశ్వాసం అనే అంశంలో లోటు కనిపిస్తుంది. ఈ లోటును తొలగించి, నమ్మకాన్ని పెంచాలి. ప్రపంచం మంచి కోసం మనం అందరం కలిసి నడవాలి. కరోనా​, ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా ఏర్పడిన లోటును మనం భర్తీ నమ్మకంతో భర్తీ చేయాలి” అంటూ ప్రధాని పిలుపిచ్చారు. 

“‘సబ్​కా సాత్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా ప్రయాస్​’ మంత్రంతో అందరం ముందుకు వెళ్లాలి. తూర్పు-పడమర, ఉత్తరం-దక్షిణం మధ్య ఉన్న విభేదాలైనా, ఆహారం, ఇంధనం, ఉగ్రవాదం, సైబర్​ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఎనర్జీ.. ఇలా ఏదైనా భావి తరాల కోసం మనం మన సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని మోదీ సూచించారు.

ఇక తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ప్రధాని జీ20లోకి ఆఫ్రికన్​ యూనియన్​కు స్వాగతం పలికారు. ఇది ఆఫ్రికెన్​ యూనియన్​కు ఓ చారత్రిక ఘట్టం! సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేత అజాలీ అసౌమనీని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

అంతకుముందు మొరాకోలో సంభవించిన భూకంపంలో మృతులకు సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. వారి అత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ప్రకృతి విపత్తు సృష్టించిన అలజడి నుంచి మొరాకో దేశం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్‌ అండగా ఉంటుందని తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు దిల్లీకి వచ్చారు. వీరిలో కొందరు శుక్రవారం రాత్రికి, శనివారం ఉదయానికి చేరుకున్నారు.

‘మొరాకోలో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ విషాద సమయంలో మొరాకో ప్రజల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా,. గ‌త కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పు గురించి తీవ్ర స్థాయిలో చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. జీ20 సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా చర్చీనీయాంశమైంది. 
 
తాజాగా జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ వద్ద టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్‌ అని రాసి ఉంది. ఇప్పటి వ‌ర‌కు అంత‌ర్జాతీయంగా భార‌త్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంత‌ర్జాతీయ స‌మావేశంలో ఇండియాను భార‌త్‌గా గుర్తిస్తూ రౌండ్‌టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. మోదీ త‌న ప్రసంగాన్ని ప్రారంభిస్తూ భార‌త్ మిమ్మల్ని స్వాగ‌తిస్తోంద‌ని చెప్పారు.