ఉక్రెయిన్ లో సమగ్ర, న్యాయమైన, నిజమైన శాంతికై జి20 పిలుపు

సంవత్సరంకు పైగా యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ పై సమగ్రమైన, న్యాయమైన, నిజమైన శాంతి కోసం పిలుపిస్తూ జి20 సదస్సు మొదటిరోజు ఉమ్మడి ప్రకటన చేసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ నాయకుల మధ్య విభేదాల నెలకొన్న దృష్ట్యా, ఉమ్మడి తుది ప్రకటన కోసం ఏకాభిప్రాయంకు రావడం అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ కు దౌత్యపరంగా గొప్ప విజయంగా భావిస్తున్నారు. 
 
జి20 అధ్యక్ష హోదాలో సదస్సు అజెండాకు ఆమోదాన్ని, ప్రపంచ నాయకుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆతిధ్య దేశంగా భారత్ పై బాధ్యత ఉంది. గత ఏడాది ఇండోనేసియాలో జి20 సదస్సు జరిగిన సమయంలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరక ఉమ్మడి ప్రకటన చేయలేక పోయారు.
 
జీ20 సదస్సు ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జి20 సదస్సు సందర్భంగా ప్రకటించారు. “అందరి కృషి నేపథ్యంలో, మేము జి20 నాయకుల సదస్సు ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని పొందాము. ఈ డిక్లరేషన్‌ను ఆమోదించినట్లు నేను ప్రకటిస్తున్నాను’ అని జి20 నేతలతో కలసి ప్రధాని మోదీ వెల్లడించారు.
 
గత ఏడాది ఇండోనేషియాలో ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధంపై జి20 నేతల మధ్య తీవ్రంగా  బేధాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చాలా దేశాలు రష్యా దాడిని ఖండించినప్పటికీ, భిన్నమైన అభిప్రాయాలు  వ్యక్తం చేశారు.  జి20 నాయకులు ఢిల్లీలో ఆమోదించిన ఏకాభిప్రాయ ప్రకటనలో “ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, మన్నికైన శాంతి” కోసం పిలుపునిచ్చారు. సభ్య దేశాలను “భూభాగాలను ఆక్రమించుకొని   ముప్పును మానుకోవాలని” లేదా ఏదైనా దేశపు ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా వ్యవహరించరాదని స్పష్టంగా పిలుపిచ్చారు. 
 
అణ్వాయుధాల ఉపయోగం లేదా ఉపయోగించే ముప్పును  “అనుమతించలేనిది” అని కూడా డిక్లరేషన్ స్పష్టం చేసింది. “ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ మానవతా చట్టం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడే బహుపాక్షిక వ్యవస్థతో సహా అంతర్జాతీయ చట్టం సూత్రాలను సమర్థించాలని మేము అన్ని దేశాలకు పిలుపునిస్తున్నాము” అని తెలిపారు.
 
సంఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నాలు, అలాగే దౌత్యం, సంభాషణలు చాలా కీలకం అని స్పష్టం చేశారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రతికూల ప్రభావాన్ని పరిష్కరించడానికి, ఐక్యరాజ్యసమితి చార్టర్ లోని అన్ని లక్ష్యాలు, సూత్రాలను సమర్థించే ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, మన్నికైన శాంతికి మద్దతు ఇచ్చే అన్ని సంబంధిత, నిర్మాణాత్మక కార్యక్రమాలను స్వాగతించే మా ప్రయత్నంలో మేము ఐక్యంగా కృషి చేస్తాము” అంటూ ప్రకటించారు.
 
‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే స్ఫూర్తితో దేశాల మధ్య శాంతియుత, స్నేహపూర్వక, మంచి పొరుగు సంబంధాలను పెంపొందించడం అవసరం” అని డిక్లరేషన్ పేర్కొన్నది. భారత్ జి20 అధ్యక్ష పదవి చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, కార్యాచరణ ఆధారితమైనదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. “భారతదేశపు జి20 ప్రెసిడెన్సీ జి-20 చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మునుపటి అధ్యక్షుల కంటే గణనీయమైన పనిని రెట్టింపు చేసింది,” అని చెప్పారు.