ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి

రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో హోంగార్డు కమాండెంట్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన రవీందర్ కన్నుమూశారు. కంచన్‌ భాగ్ డిఆర్‌డివో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు. ఈఎంఐ చెల్లింపు తేదీ సమీపించిన జీతం అందకపోవడంతో మనస్తాపం చెందిన హోంగార్డు సెప్టెంబర్ 5వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
అంతకు ముందు వేతనాల గురించి హోంగార్డుల కార్యాలయ ఉద్యోగులతో రవీందర్ మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారని అడిగిన రవీందర్‌ను చెక్కులు క్లియర్ అవ్వాలని ఉద్యోగి బదులిచ్చారు. రెండు నెలలుగా జీతాలు లేవని చెప్పడంతో సిఎం కేసీఆర్‌ను అడగాలని పోలీస్ అధికారి సూచించారు. 
 
దీంతో రవీందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని కమాండెంట్ కార్యాలయంలోకి పరుగులు పెట్టాడు. హైదరాబాద్‌లో హోంగార్డ్స్ కమాండెంట్‌ కార్యాలయంలో ఈ ఘటన మూడ్రోజుల క్రితం చోటు చేసుకుంది. ఈఎంఐ చెల్లింపు తేదీ వచ్చినా జీతం అందకపోవడంతో హోంగార్డు రవీందర్ ఒత్తిడికి గురయ్యాడు. 
 
రెండు నెలలుగా వేతనాలు లేకపోవడం ఆర్థికంగా సతమతం అవుతున్నాడు. వేతనం చెల్లింపులో జాప్యానికి నిరసనగా కమాండెంట్‌ కార్యాలయంలోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన ఎం.రవీందర్‌(38) చాంద్రాయణ గుట్ట ట్రాఫిక్‌ ఠాణాలో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

 
గురువారమే ఆసుపత్రిలో రవీందర్ ను పరామర్శించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అతని మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆరోపించారు. 
 
హోంగార్డ్‌లకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండించారు.‘హోంగార్డ్‌లకు విజ్ఞప్తి. తొందరపడొద్దు. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దు’’ అని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
 
రవీందర్ ఆత్మహత్యాయత్నంతో బుధవారం ప్రభుత్వం హడావుడిగా వేతనాలు చెల్లించింది. హోంగార్డులు విధులు బహిష్కరించి ఆందోళనకు సిద్ధం కావడంతో వారిని బుజ్జగించారు. రవీందర్ కన్నుమూయడంతో ఉస్మానియా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.