విద్యార్థులపై చిత్రహింసలపై సిపి రంగనాథ్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన ఘటన వరంగల్ పోలీస్ కమీషనర్ – బీజేపీ మధ్య వివాదంగా మారింది. వరంగల్  పోలీస్ కమిషనర్ రంగనాథ్ అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని బీజేపీ ఎమ్మెల్యే ఎమ్ రఘునందన్ రావు హెచ్చరించారు. 
 
కాకతీయ యూనివర్సిటీలో గాయపడిన విద్యార్థులను ఎమ్మెల్యే రఘునందన్ శుక్రవారం పరామర్శించగా, పోలీసులు తమను చితకబాదారని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై సీపీ ఎందుకు విచారణ చేయటం లేదని ఎమ్యెల్యే ప్రశ్నించారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు ఎందుకు తిప్పారని ఆయన నిలదీశారు.
 
పోలీసులు కొమ్ముకాసే ప్రభుత్వం ఇంకా నాలుగు నెలలే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  వరంగల్ సీపీ రంగనాథ్ కేయూ విద్యార్థుల కేసును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సీపీ రంగనాథ్ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, షాడో సీఎంలు చెప్పినట్టు వినొద్దని ఆయన హితవు చెప్పారు. 
 
విద్యార్థులను అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్ కాకుండా టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోకి ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే సీపీ రంగనాథ్ మనకు అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీ రంగనాథ్ వ్యవస్థలను ఎందుకు మేనేజ్ చేయాలనుకుంటున్నారని రఘునందన్ రావు నిలదీశారు.
 
ఈ విషయంలో సీపీ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని వెల్లడించారు. సీపీ రంగనాథ్ పై కోర్టులో కేసులు వేస్తామని పేర్కొంటూ ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, కేయూలో విద్యార్థుల ఆందోళన ఘటనపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ గురువారం స్పందిస్తూ కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక విద్యార్థికి మాత్రమే గతంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని పేర్కొన్నారు. విద్యార్థులను పోలీసు స్టేషన్ కు తరలించినప్పుడు గాయాలయ్యాయి తప్ప, ఎవరిని పోలీసులు కొట్టలేదని స్పష్టం చేశారు. 

విద్యార్థులు లేని గాయాలకు కట్లు కట్టుకున్నారని సీపీ రంగనాథ్ ఆరోపించారు. కావాలంటే విద్యార్థులకు మరోసారి పరీక్షలు చేయించవచ్చని చెప్పారు. తమ వద్ద విద్యార్థులు ఎలా ప్రవర్తించారో అన్ని వీడియోలు ఉన్నాయని చెబుతూ ప్రతి చిన్న విషయానికి పోలీసులపై బురద జల్లడం కొందరికి అలవాటైందని సీపీ ఆరోపించారు.

అరెస్టైన వారిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, కొందరికి జైలు శిక్షలు కూడా పడ్డాయని అయన చెప్పారు. విద్యార్థుల పట్ల పోలీసులు చాలా సహనంగా ప్రవర్తించారని, విద్యార్థులు దురుసుగా ప్రవర్తించినా ఎక్కడా పోలీసులు సహనం కోల్పోలేదని స్పష్టం చేశారు.