తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మూడు పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని, హిందూ వ్యతిరేకత వాటి విధానమని ధ్వజమెత్తారు.
శుక్రవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టేనని, కాంగ్రెస్ కు ఓటు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టేనని, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమని జోస్యం చెప్పారు.
కుటుంబ, రాచరిక పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కనుసన్నల్లోనే పని చేస్తోందని పేర్కొంటూ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామి అయిందని గుర్తు చేశారు.
2014లో కూడా కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసే ఉందని పేర్కొంటూ. బేరం కుదరక కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయలేదని, బేరం కుదిరితే ఎప్పటికైనా కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తేల్చి చెప్పారు. గత ఐదేళ్లుగా జాతీయ రాజకీయాల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని సమావేశాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి పాల్గొందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఇటీవల కెసిఆర్ సన్నిహితుడైన ఓ కీలక నేత మన వాళ్ళు కొందరు కాంగ్రెస్ ఉన్నారని, వారిని అడ్డుకోకండని, వారికి సహకరించండి అని బాహాటంగానే మాట్లాడారని తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో విలీనమయ్యారని చెప్పారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురో, ఆరుగురో గెలిస్తే వాళ్లు కూడా బీఆర్ఎస్ లోనే చేరిపోతారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పట్ల, సీఎం కేసీఆర్ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ప్రజలు అరాచక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ప్రజలు నిజాయితీతో కూడిన జనతా సర్కారును కోరుకుంటున్నారని చెబుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు స్పష్టం చేశాయని చెప్పారు. అయితే, బీజేపీ గెలుపును అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బిజెపికి పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపిచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఎంఐఎంకు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు జూన్ 2 ఉందిగా ఇక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అంటూ ఎంఐఎం మెప్పు పొందే కథలు చెప్పుకొంటూ వచ్చారని దుయ్యబట్టారు.
బిజెపి ఒత్తిడి మేరకు గత ఏడాది అధికారికంగా, మొక్కుబడిగా నిర్వహించినట్లు నటిచాంరని అంటూ ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుండడంతో వేరే దారి లేక, గత్యంతరం లేక కేసీఆర్ కూడా మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ప్రకాశ్ జవదేకర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ సునిల్ బన్సల్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి.కె. అరుణ, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ పి.మురళీధర్ రావుతో రాష్ట్రానికి చెందిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు పాల్గొన్నారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం