అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట… ఇక కవిత వంతు!

దేశంలో రాజకీయంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం  కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. శుక్రవారం సాయంత్రం అప్రూవర్‌గా మారిన ఎంపీ ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు కీలక సమాచారం అందించారు.
దానితో ఈ కేసులో వేగంగా పలు మార్పులు జరుగబోతున్నాయని, త్వరలోనే బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను పిలిచే అవకాశం ఉందని తెలుస్తున్నది.
 
ఇప్పటికే ఈ కేసులో ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి రెడ్డి కూడా అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెయిల్‌పైన బయటికొచ్చి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనేక మందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి-10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
 
ఢిల్లీలో ప్రారంభమైన జీ-20 శిఖరాగ్ర సదస్సు ముగిశాక లిక్కర్ కేసులో అసలు కథ ప్రారంభం అవుతుందని దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ  అంటున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు సబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లక్ష్యంగా దూకుడు పెరుగుతుందని, తెలంగాణాకు సంబంధించి కీలక వ్యవహారాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణాలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో  అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టింది. మరోవైపు,  గత కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందికి పైగా కీలక వ్యక్తులను పిలిపించి ఈడీ ప్రశ్నించింది.
 
ఈ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును మరోసారి ఈడీ  బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6.15 గంటల వరకూ ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసు విచారణలో బుచ్చిబాబు వాంగ్మూలం అత్యంత కీలకంగా మారబోతోందని చెబుతున్నారు. 
 
గత వారంలో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు తెలుగువారిని పిలిపించి ఈడీ ప్రశ్నించింది. బుచ్చిబాబు తర్వాత ఈడీ ఎవర్ని విచారణకు పిలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అతి త్వరలోనే కవితకు ఈడీ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.