యూపీఐ ఏటీఎం.. ఇక కార్డ్ లేకుండానే క్యాష్ విత్ డ్రా

డిజిటలైజేషన్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాంకు సేవింగ్స్ ఖాతాతో అనుసంధానమైన ఏటీఎం కార్డుతో మనీ విత్ డ్రా చేసుకునేవారు. రాన్రాను ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్.. మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ జరిగిపోతున్నాయి.  క్షణాల్లో వస్తువులు, సేవల కొనుగోళ్లపై బిల్లులు, చార్జీల చెల్లింపులు పూర్తవుతున్నాయి.
యూపీఐ పేమెంట్స్‌కు సంబంధిత వ్యక్తి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఏటీఎం కార్డు అనుసంధానం తప్పనిసరి. కానీ, ఇప్పుడు బ్యాంకు పొదుపు ఖాతా ఏటీఎం అక్కర్లేకుండానే యూపీఐ యాప్ ఆధారంగా నేరుగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. భారత్ లో తొలి యూపీఐ ఏటీఎం ప్రారంభమైంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఆ దిశగా తొలి అడుగు పడింది.
జపాన్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మొట్టమొదటి యూపీఐ-ఏటీఎం సేవలు ప్రారంభించింది. దానికి హిటాచీ మనీస్పాట్ ఏటీఎం అనే పేరు పెట్టింది. మంగళవారం ముంబైలో జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023’ దీన్ని ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  భాగస్వామ్యంతో హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సంస్థ వైట్ లేబుల్ ఏటీఎంగా ఈ యూపీఐ ఏటీఎం ను ప్రారంభించింది.
ఈ ఏటీఎం ద్వారా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ‘యూపీఐ ఆధారిత ఏటీఎం ఉపయోగించడం చాలా తేలిక, సురక్షితం కూడా’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ కం సీఈఓ సుమిల్ వికంసే చెప్పారు. ఈ ఎటీఎం ద్వారా నగదును విత్ డ్రా చేయడానికిి ఒక స్మార్ట్ ఫోన్, అందులో ఏదైనా యూపీఐ యాప్ ఉంటే సరిపోతుంది.
క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఈ ఏటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సేవల్లో ఈ యూపీఐ ఏటీఎం ఒక విప్లవాత్మక ముందడుగు అని ఎన్సీపీఐ తెలిపింది. కార్డ్ అవసరం లేకుండా మారు మూల ప్రాంతాల్లోనూ క్యాష్ విత్ డ్రాకు ఈ ఏటీఎం ఉపయోగపడ్తుందని తెలిపింది.

ఇలా విత్ డ్రా చేయండి

ఈ యూపీఐ ఏటీెఎం ను ఇంటరాపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ అని కూడా అంటారు. ఈ విధానంలో నగదును క్రింద పేర్కొన విధంగా ఉపసంహరించుకోవచ్చు:

  • ఏటీఎంలలో కస్టమర్ యూపీఐ క్యాష్ విత్ డ్రాయల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • విత్ డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలని ఏటీఎం మిషన్ సూచిస్తుంది.
  • ఆ మొత్తాన్ని ఎంటర్ చేసిన తరువాత ఏటీెఎం స్క్రీన్ పై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
  • కస్టమర్ తన స్మార్ట్ ఫోన్ లోని ఏదైనా యూపీఐ యాప్ లో ఉన్న స్కానర్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.
  • యూపీఐ పిన్ ను ఎంటర్ చేయాలి
  • దాంతో, మీరు ఎంటర్ చేసిన మొత్తంలో నగదు బయటకు వస్తుంది.