భారత్, మధ్య తూర్పు, ఐరోపా అనుసంధాన కారిడార్

భారత్, మధ్య తూర్పు, ఐరోపా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్‌ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్‌ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఈ మేరకు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ కారిడార్‌ కనెక్టివిటీ స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక ఒప్పందమని కొనియాడారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థిరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం, వాటిపై పెట్టుబడులు పెట్టడం, మెరుగైన భవిష్యత్తును సృష్టించడం గొప్ప విషయమని తెలిపారు. 

“సుస్థిరమైన, స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, నాణ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టడం, మంచి భవిష్యత్తును సృష్టించడం… గత సంవత్సరం, ఈ విజన్‌కు కట్టుబడి ఉండటానికి మేము ఒకటయ్యాము. మా భాగస్వాములు ఎకనామిక్ కారిడార్ ను నిజం చేయడానికి కృషి చేస్తున్నారు” అని బిడెన్ తెలిపారు.  

తక్కువ-మధ్య-ఆదాయ దేశాలలో మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడానికి మేము కృషి చేయడంద్వారా తమ పెట్టుబడుల ప్రభావాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది చారిత్రక ప్రయోగమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అభివర్ణించారు.

మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్‌తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వేలు, పోర్ట్‌లను భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ కనెక్టివిటీ కారిడార్ కలుపుతుందని ఓ వార్తా సంస్థ తెలిపింది. దీని వల్ల భారత్‌, ఐరోపా మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.  ముంబై నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరప్‌కు ప్రయాణించే షిప్పింగ్ కంటైనర్లు భవిష్యత్తులో రైలు మార్గం ద్వారా దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని హైఫాకు, ఆ తర్వాత యూరప్‌కు చేరుతాయని వెల్లడించింది. తద్వారా డబ్బుతోపాటు సమయం ఆదా అవుతాయని అంచనా వేసింది.