అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ప్రాణాంతక బ్యాక్టీరియా

గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. ఇటీవల బయటపడ్డామని అనుకుంటున్న లోపే కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకువస్తున్నది. దీంతో పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు సైతం మళ్లీ నమోదవుతున్నాయి. 

కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటున్న సమయంలో అమెరికాలో కొత్తగా మరో బ్యాక్టీరియా బయటపడిందని  సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) శాస్త్రవేత్తలు నిపుణులు అప్రమత్తం చేశారు. అమెరికాలోని చాలా ప్రాంతాలలో ‘విబ్రియో వల్నిఫికస్’ బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారని సీడీసీ నిపుణులు పేర్కొన్నారు. 

ప్రతి ఏటా సుమారు 200 మంది అమెరికన్లు విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతుండగా, కనీసం ఐదుగురు మరణిస్తున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టేందుకు చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. విబ్రియో వల్నిఫికస్ బాక్టీరియా మానవులలో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. 

పచ్చి మాంసం, ఉడకని మాంసాన్ని తినడంతో చర్మ గాయాలకు కారణమవుతుంది. వ్యాధి లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. జ్వరం, లో బీపీ, చర్మంపై బొబ్బలు ఏర్పడుతాయి. ఇవి విబ్రియో వల్నిఫికస్ లక్షణాలని, ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.

వల్నిఫికస్ చర్మం, కణజాలాల్లో నెక్రోటైజింగ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని సీడీసీ నిపుణులు తెలిపారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండగా, వరదలు, తుఫానులు వాతావరణ పరిస్థితులతో పాటు అంటువ్యాధులు ఈ కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ పేర్కొంది. 

మే నుంచి అక్టోబర్‌ వరకు బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుందని సీడీసీ చెప్పింది. సముద్ర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ పెరుగుతుందని పేర్కొంది. సిర్రోసిస్, క్రానిక్ కిడ్నీ వ్యాధి, మధుమేహం, గతంలో కాలేయ వ్యాధులు ఉన్నట్లయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

 స్త్రీలలో కంటే పురుషుల్లో ఈ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కొన్ని స్వీయ సంరక్షణ చర్యలు పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

పచ్చి, సరిగా ఉడకని మాంసంతో పాటు ముఖ్యంగా సముద్రపు చేపలను తీసుకోవడాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో టాటూలు వేసుకోవడం, శస్త్రచికిత్స చేయించుకున్న వారు సముద్రపు జలాలు, ఉప్పు నీటి జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. సముద్రాలకు దగ్గరగా నివసించే వారికి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని, అలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు