మణిపూర్ పై ఐరాస వ్యాఖ్యలను ఖండించిన భారత్

మణిపూర్‌పై ఐరాస నిపుణుల వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఐరాస నిపుణుల వ్యాఖ్యలు అసమంజసం, ఊహాజనితం, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఐరాసలోని భారత బృందం పేర్కొంది. మణిపూర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటూ ఐరాసలోని మానవ హక్కుల హైకమిషనర్‌ స్పెషల్‌ ప్రొసీజర్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌కి భారత ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది.

 మణిపుర్‌లో పరిస్థితి నిలకడగా ఉందని, అక్కడ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ప్రభుత్వం భారత పౌరుల మానవ హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉందని, మణిపుర్‌లో కూడా అదే విధంగా చర్యలు చేపడుతోందని పేర్కొంది. 

ఐరాస నిపుణుల న్యూస్‌ రిలీజ్‌ను పూర్తిగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఈ నివేదిక అసమంజసంగా ఉండటంతోపాటు.. ఊహాజనితమైందని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. అక్కడి పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏమాత్రం అవగాహన లేకుండా మోసపూరితమైన నివేదిక అని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి బృందం పేర్కొంది. 

భవిష్యత్తులో వాస్తవాలకు అనుగుణంగా తమ అంచనాలను రూపొందిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఐరాస నిపుణుల బృందం  భారత్‌లోని మణిపుర్‌లో జరిగిన  తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు, దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ గత నెల 29న ఓ నివేదిక విడుదల చేసింది.