`భారత్’ గా మారనున్న `ఇండియా’ పేరు!

మన దేశం పేరును `ఇండియా’ నుంచి `భారత్’గా మార‌నుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జ‌రిగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో న‌రేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ను స‌భ్యుల ముందుంచ‌నుంద‌ని భావిస్తున్నారు.  “ఇండియా” పేరును మార్చేందుకు . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని పలు అంశాలను సంకేతం ఇస్తున్నాయి.
రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌గా మార్చే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని, ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ ప్రభుత్వం పావులు క‌దుపుతోంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా,  రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి జీ20 ప్ర‌తినిధుల‌కు అధికారిక స‌మాచారంలో `ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్ధానంలో `ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాసి ఉండ‌టం పేరు మార్పు ప్ర‌తిపాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ దేశ త్రివర్ణ పతాక ఎమోజీని ట్విట్టర్‌లో (ఎక్స్‌) పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. బిగ్‌ బీ ట్వీట్‌తో ఇండియా పేరు మార్పు ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ అధికారిక కార్య‌క్ర‌మానికి ఆహ్వానంపై `ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాయ‌డం ఇదే తొలిసారి అని అధికారులు చెబుత‌న్నారు.
అయితే, భార‌త్ అన్న ప‌దం మ‌న రాజ్యాంగంలో ఉంద‌ని స్పష్టం చేస్తున్నారు. `ఇండియా లేదా భార‌త్‌’ను ఆర్టిక‌ల్ 1 ప్ర‌కారం యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్‌గా గుర్తిస్తారు.  విదేశీ ప్ర‌తినిధుల‌కు అంద‌జేసిన జీ20 బుక్‌లెట్‌లోనూ `భార‌త్’ అన్న ప‌దాన్ని వాడారు. ప్ర‌జాస్వామ్యానికి భార‌త్‌ త‌ల్లి లాంటిద‌ని, వేల ఏండ్ల నుంచి ఇక్క‌డ సుసంప‌న్న‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లితున్న‌ట్లు ఓ బుక్‌లెట్‌లో రాశారు.

రాష్ట్ర‌ప‌తి విందు ఆహ్వానపత్రం లీకైన త‌ర్వాత‌ అస్సాం ముహ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ త‌న ట్వీట్‌లో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. `రిప‌బ్లిక్ ఆఫ్ భార‌త్’ అని రాస్తూ మ‌న నాగ‌రిక‌త ముందుకు వెళ్ల‌డం గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు. మన దేశం పేరును `ఇండియా’ నుంచి `భారత్’గా మార్చాలని గత కొంతకాలంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

 ముఖ్యంగా ఆర్​ఎస్​ఎస్​ సర్ సంఘచాలక్ డా. మోహన్​ భగవత్​ దేశ పేరును మార్చాలని అనేకమార్లు తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశాన్ని `ఇండియా’ అని పిలవడం ఆపేయాలని, `భారత్’​ అని పిలవాలని పలు సందర్భాలలో స్పష్టం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. 

2022 ఆగస్ట్​ 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం చేసిన ప్రసంగంలఇండియా పేరు మార్చాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇండియా పేరును భారత్​గా మార్చాలన్న అంశానికి చాలా మంది మద్దతిస్తున్నారు. భారత్​ అనేది దేశ గౌరవానికి చిహ్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవ‌ల విప‌క్ష పార్టీలు త‌మ కూట‌మికి ఇండియా అన్న పేరు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే అప్ప‌టి నుంచి ఇండియా, భార‌త్ అంశంపై వివాదం చెల‌రేగుతూనే ఉంది.

జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో `ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని పేర్కొన‌డంపై కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తి విష‌యంలో స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయ‌ని ఎద్దేవా చేశారు.  దేశం ఇప్ప‌టికీ, ఎన్న‌టికీ భార‌త్‌గానే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ నేత‌ల‌కు తానేమీ చెప్ప‌ద‌లుచుకోలేద‌ని, తాను భార‌త్‌వాసిన‌ని, త‌న దేశం పేరు భార‌త్ అని ఎప్ప‌టికీ భార‌త్‌గానే ఉంటుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.