ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం.. పైగా ఎదురుదాడి!

ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం.. పైగా ఎదురుదాడి!
 
* ముడుపుల వ్యవహారాలపై కోడ్ పదజాలం
 
మరో కొద్దీ నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అమరావతి కాంట్రాక్టర్ల  నుండి రూ 118 కోట్ల మేరకు ముడుపులు తీసుకున్నారంటూ ఆదాయ పన్నుల శాఖ నోటీసులు జారీ చేయడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. నోటీసు జారీ చేసి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గాని, టిడిపి నేతలు గాని నోరు మెదపక పోవడం గమనార్హం.
 
పైగా, తనకు నోటీసులు జారీ చేసే అధికార పరిధి ఉందా? అంటూ జారీచేసిన అధికారులపైననే ఎదురు దాడికి దిగుతున్నారు. ఐటీ అధికారులు తమ పరిధి ఏమిటో తెలుసుకోవాలని, తనకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు లేదనేది చంద్రబాబు వాదిస్తున్నారు.  సెంట్రల్ ఆఫీస్‌కు ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారంటూ చంద్రబాబు ఎదురు దాడికి దిగడం ద్వారా అసహనం ప్రదర్శిస్తున్నారు. 
చంద్రబాబుకు 2022 అక్టోబర్ 10, 27, 2023 జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపు పన్ను అధికారులకు లేఖలు రాశారు. అయితే, ఈ అభ్యంతరాలను ఐటీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు.  ఇప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులలో జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చి, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని అంటూ నిత్యం  విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ శ్రేణులకు మొదటిసారిగా అవినీతి ఆరోపణలలో అధికారికంగా చంద్రబాబు దొరికిపోవడంతో ఓ విధంగా పండుగా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారంకు దిగుతున్నారు.
చంద్రబాబుకు ముడుపులు చేరిన విషయంలో ఆదాయపన్ను శాఖ ప్రధానంగా ఆయన పిఎ పెండ్యాల శ్రీనివాస్ జరిపిన వాట్స్ అప్ సందేశాలను ఆధారాలుగా చూపుతున్నారు. ఆ సందేశాలలో దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు కోడ్ పదాలు ఉపయోగించారని ప్రచారం జరుగుతుంది. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు.
రూ. 118,98,13,207 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు సాగుతున్న కొద్ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. 8,000 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపుల రూపంలో తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు  తీసుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండటానికి కోడ్ లాంగ్వేజ్‌ను వినియోగించినట్లు చెబుతున్నారు. ముడుపుల రూపంలో అందిన డబ్బును ఏఏ ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలనే విషయం ఎక్కడా బయటపడకుండా ఉండేలా పగడ్బందీగా కోడ్ భాషను ఉపయోగించారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు డబ్బును తరలించడానికి HYD అనే కోడ్ వాడారు. విజయవాడలోని తమ అనుయాయులకు పంపించడానికి విజయ్ అని, విశాఖపట్నానికి విష్ అనే పదాలను వాడారు.

బెంగళూరుకు డబ్బును తరలించడానికి బాంగ్ అని వారి మధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా సర్కులేట్ అవుతున్నాయి. దీనితో పాటు ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. క్యాష్ అనే చోట స్టీల్ అనే పదాన్ని వాడారు. స్టీల్ అంటే డబ్బు అని, దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు. ఒక టన్ను అంటే ఒక కోటి రూపాయలుగా భావిస్తున్నారు.

ఆయా కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.