వైఎస్ భాస్కర్‌ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. భాస్కర్‌ రెడ్డితో పాటు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది.

వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపిస్తున్న సీబీఐ, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే నిందితులు సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తారని అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో భాస్కర్‌ రెడ్డితో పాటు ఉదయ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిసన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వివేకా హత్యలో నిందితుల ప్రమేయం ఉందని, బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని అంటూ సీబీఐ అభ్యంతరం తెలిపింది .

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యతో పాటు, సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారని బెయిల్‌ పిటిషన్‌ల విచారణలో సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, సాక్షులను ప్రభావితం చేయగలరని, వారికి బెయిలు మంజూరు చేయ రాదని విజ్ఞప్తి చేసింది. 

గతంలో కూడా కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు బెయిలిస్తే విచారణను సాఫీగా సాగనివ్వరని తెలిపింది. వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వైఎస్‌ భాస్కరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఆగష్టు25న విచారణ జరిపారు. 

సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తోమర్‌ వాదనలు వినిపిస్తూ దస్తగిరి వాంగ్మూలంతోపాటు దానికి తగ్గ పలు ఆధారాలను పరిశీలించిన తర్వాతే కేసులో వీరిని నిందితులుగా పేర్కొన్నట్లు చెప్పారు. హత్యకు ముందు, తరువాత నిందితులైన సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వైఎస్‌ భాస్కరరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి నివాసంలో ఉన్నారని గూగూల్‌ టేకౌట్‌ ద్వారా తేలిందని వివరించారు.

వైఎస్‌ భాస్కరరెడ్డి సంఘటన స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా తలుపులు మూసి సాక్ష్యాధారాలను చెరిపి వేయించారని పేర్కొన్నారు. వివేకా మృతదేహాన్ని చూస్తే హత్య అని తెలుస్తున్నా గుండెపోటుతో చనిపోయారని కట్టుకథ చెప్పారని, బ్యాండేజీ, పూలతో వివేకా దేహంపై గాయాలను కప్పిపెట్టారని అంటూ సీబీఐ వాదించింది.