వైఎస్ వివేకా హత్యకు అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర

మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ పునరుద్ఘాటించింది. రాజకీయ వైరమే ఈ కుట్రకు కారణమని తెలిపింది.  మరోవంక, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగనుంది.  వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో సీబీఐ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో అవినాశ్‌ రెడ్డి పాత్రను స్పష్టంగా వెల్లడించింది.  గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాలని తెలిపింది. 

వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడని వివరించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది.

సీబీఐ వాదన ప్రకారం వివేకానంద రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆయనకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, డీ శివశంకర్‌ రెడ్డి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఏర్పడ్డాయి. దాంతో వివేకాను హత్య చేయడానికి అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి కుట్రపన్నడం మొదలుపెట్టారు. 

శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్‌ రావాలని భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి కోరుకోగా… ఆ టికెట్‌ వివేకానందరెడ్డికి వచ్చింది. పగ పెంచుకున్న వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు వెన్నుపోటు పొడిచారు. ఫలితంగా 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి చెందారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, టీ గంగిరెడ్డి వెన్నుపోటు పొడిచారని గ్రహించిన వివేకా, వారి నివాసాలకు వెళ్లి తిట్టారు.

సుదీర్ఘకాలం అనుచరుడిగా ఉన్న గంగిరెడ్డిపై వివేకా విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయనను కూడా పలుసార్లు వివేకా తిట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ అవినాశ్‌ రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్‌ షర్మిలకు లేదా వైఎస్‌ విజయమ్మకు రావాలని వివేకా కోరుకున్నారు. ఆ ఏడాది మార్చి 20న అవినాశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, టికెట్‌ విషయంలో వివేకా ఆలోచనను అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి అంచనా వేయలేదు.  వివేకా ఆలోచన పట్ల వారు సంతోషంగా లేరు.